ఎన్నికల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండలు, దేవాలయాల వద్ద కూచొని లోకంలోని అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటుంటారు. తమకు నచ్చిన, తెలిసిన విషయాల గురించి అవసరమైతే వాదనలు చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో మళ్లీ జగనే సీఎం అవుతారని వాదించే గ్రామీణలు ఒక సెంటిమెంట్‌ను తెరపైకి తేవడం ఆసక్తికర పరిణామం. చంద్రబాబునాయుడు అధికారంలో వుంటే వానలు పడవని రైతాంగం నమ్ముతోంది. గతంలో వైఎస్సార్ అధికారంలో ఉన్నప్పుడు కరవు అనే మాటకే చోటు లేదు. పుష్కలంగా వర్షాలు కురిసేవని రైతులు గుర్తు చేస్తున్నారు. అలాగే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వర్షాలకు ఇబ్బందే లేదని గుర్తు చేస్తున్నారు.
ఇదే చంద్రబాబు అధికారంలో వుంటే మాత్రం.. కరవులు పిలవకుండానే వస్తాయనే చర్చకు తెరలేచింది. తాజాగా వర్షాలు మొదలయ్యాయని, తుపాన్ హెచ్చరికను వాతావరణ శాఖ చేస్తోందని, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనేందుకు ఇదే సంకేతమని పల్లెల్లో రచ్చబండల వద్ద రైతులు గట్టిగా చెబుతున్నారు. వాన సెంటిమెంట్‌ను ఒప్పుకోని రైతులను తప్పు పడుతున్నారు. జగన్ రాకకు సంకేతంగా వానలు ముందస్తు స్వాగతం పలుకుతున్నాయనేది రైతాంగం అభిప్రాయం.
చంద్రబాబు అధికారంలో వుంటే కరవులతో తప్ప, ఎప్పుడూ వర్షాలు పడిన సందర్భం లేదని గ్రామీణులు అంటున్నారు. అందుకే బాబు వస్తాడంటే, వామ్మో ఐదేళ్లు కరవులు తప్పవని భయపడే పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతాంగం వాన సెంటిమెంట్‌ను కొట్టి పారేయలేని పరిస్థితి.