పేటలో ఊహకందని అంచనాలు

ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి రసవత్తరమైన పోరు సాగింది. మాజీ ఎమ్మెల్యే టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనితకు అలాగే రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులుకు మధ్యనే ఈ…

ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి రసవత్తరమైన పోరు సాగింది. మాజీ ఎమ్మెల్యే టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనితకు అలాగే రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులుకు మధ్యనే ఈ పోటీ జరిగినట్లుగా పోలింగ్ విధానం తేటతెల్లం చేస్తోంది.

ఇద్దరూ పాయకరావుపేటకు నాన్ లోకల్స్ గానే ఉన్నారు. అనిత అయితే విశాఖలో మకాం ఉంటున్నారు అని గతంలో వైసీపీ ఆరోపించేది. ఇపుడు రాజాం నుంచి జోగులుని షిఫ్ట్ చేయడంతో ఆయన పక్కా నాన్ లోకల్ అయిపోయారు. ఈ అస్త్రం టీడీపీ బాగా వాడుకుంది అని అంటున్నారు.

వైసీపీలో వర్గ పోరు ఉంది. టీడీపీలోనూ ఉంది. అయితే ఎన్నికలు దగ్గర పడే సరికి టీడీపీకి అంతా సర్దుబాటు చేసుకుందని అంటున్నారు. జనసేనతో విభేదాలు కూడా లేకుండా చేసుకుని పోలింగ్ వేళకు పటిష్టంగా టీడీపీ నిలబడింది.

వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందని అది అనితకు అనుకూలంగా మారిందని ఒక ప్రచారం ఉంది. అలాగే టీడీపీ కూటమి నుంచి వైసీపీకి క్రాస్ జరిగింది అని మరో ప్రచారానికి తెర లేచింది. దీంతో రెండు శిబిరాలలో దీని మీదనే బిగ్ డిబేట్ సాగుతోంది.

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుని అనిత కలసి పోలింగ్ జరిగిన తీరుని వివరించారు. ఈసారి పేటలో సైకిల్ పరుగులు తీయడం ఖాయమని ఆమె బాబుతో చెప్పారని అంటున్నారు. దాంతో బాబు సైతం పేటలో టీడీపీకి అనుకూలించిన పరిస్థితులను ఆమెతో పంచుకున్నారని భోగట్టా.

పేటలో విజయం తమదే అని వైసీపీ కూడా చెబుతోంది. ఆ మేరకు గణాంకాలను దగ్గర పెట్టుకుని మధింపు చేసుకుంటోంది. అనిత ధీమా నెగ్గుతుందా లేక జోగులు నమ్మకం నిలుస్తుందా అంటే జూన్ 4న ఫలితాలే చెప్పాలని అంటున్నారు.