ఉద్యోగ సంఘాల నాయకులు తాము అధికారంలో ఉన్నంతకాలం ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ ప్రవర్తించడం.. వారికి అనుకూలంగా తమ తమ సంఘాల్లోని ఉద్యోగులందరినీ కూడా నడిపించడం.. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయా పార్టీల తీర్థం పుచ్చుకోవడం.. అదృష్టం కూడా కలిసి వస్తే వారి ద్వారా రాజకీయ పదవులను కూడా దక్కించుకోవడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.
తెలంగాణలో శ్రీనివాస గౌడ్, స్వామి గౌడ్ తదితరులు అనేకమంది ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉంటూనే పదవీ విరమణ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి పెద్ద పదవులను అధిరోహించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూడా అదే సంస్కృతి ఉంది. ఎన్జీవో సంఘాల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అశోక్ బాబు పదవీ విరమణ తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు అదే తరహాలో మరో ఉద్యోగ సంఘాల నాయకుడు కూడా ఎమ్మెల్సీ కావాలని ఉవ్విళ్ళూరుతున్నట్లుగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక సంఘాల రాష్ట్ర ఛైర్మన్ గా కె.ఆర్.సూర్యనారాయణ ఉన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మెట్లు దిగిన ప్రతిసారీ.. చర్చలు సఫలం కాకుండా అడ్డుపడుతూ వచ్చిన నాయకుడిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద కొత్తగా మళ్లీ నిందలు వేస్తున్నారు. రిటైర్మెంట్ కు ఇంకా ఎంత దూరంలో ఉన్నారో తెలియదు గానీ.. వైసీపీ ప్రభుత్వం వల్ల ఉద్యోగసంఘాలు చాలా నష్టపోయాయయని అంటున్నారు.
ఉద్యోగుల జీపీఎస్ సొమ్మును తమకు తెలియకుండా తమ ఖాతాల నుంచి రూ.500 కోట్లను ప్రభుత్వం దొంగలించిందని ఆరోపిస్తున్నారు. గవర్నరు నజీర్ ను కలిసి విజ్ఞప్తి చేసినందుకు తనను టార్గెట్ చేశారన్నారు. ఉద్యోగుల్లో కొన్ని సంఘాలు ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేస్తున్నాయని కూడా అంటున్నారు.
అయితే జగన్ ప్రభుత్వంలో ఎటూ తన మాట చెల్లలేదు గనుక.. ఆయన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందనే ఆశతో ఇలా మాట్లాడుతున్నట్టుగా ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని బద్నాం చేసే మాటలు మాట్లాడడం సహజం. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా.. ఇదే తీరు అనుసరిస్తున్నారంటే.. తెలుగుదేశం అధికారంలోకి వస్తుందనే ఆశతో.. తనను కూడా ఎమ్మెల్సీ చేస్తారని కలగంటున్నట్టుగా ఉన్నదని ఉద్యోగులు ఆయన మీద జోకులు వేసుకుంటున్నారు.