చంద్రబాబుకు అనుమతులు అక్కర్లేదా?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విదేశీయాత్రకు వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి యూరోప్ యాత్రకు వెళితే.. చంద్రబాబు మాత్రం అమెరికా యాత్రకు వెళ్లారు. అయితే చంద్రబాబుకు వర్తించాల్సిన నిబంధనల విషయంలో పోలీసులు చూసీ చూడనట్టు…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విదేశీయాత్రకు వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి యూరోప్ యాత్రకు వెళితే.. చంద్రబాబు మాత్రం అమెరికా యాత్రకు వెళ్లారు. అయితే చంద్రబాబుకు వర్తించాల్సిన నిబంధనల విషయంలో పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఏకంగా 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం బెయిలు మీద ఉన్నారు. అలాగే ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ వేస్తే హైకోర్టు తిరస్కరించింది. అది ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.

తన చుట్టూ ఇన్ని రకాల అవినీతి కేసుల ఉచ్చులు బిగుసుకుని ఉండగా.. చంద్రబాబు మాత్రం ఎంచక్కా కుటుంబం సహా విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన కొడుకు నారా లోకేష్ నాలుగురోజులు ముందుగానే సకుటుంబంగా విదేశాలకు వెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. 
అయితే బెయిలు మీద ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్తున్నప్పుడు కోర్టు, పోలీసుల అనుమతి అక్కర్లేదా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. సీబీఐ కోర్టుల్లో కేసులు నడుస్తున్న కారణంగా జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసి అనుమతి వచ్చిన తర్వాత విదేశీయాత్రకు వెళ్లారు.

చంద్రబాబు మాత్రం అనుమతులేమీ తీసుకోకుండానే అమెరికా వెళ్లడానికి సిద్ధమైపోయారు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను ఆపేసినట్లుగా తెలుస్తోంది. ఇమిగ్రేషన్ అధికారులు ఆపేసిన తర్వాత సీఐడీ అధికారులతో పలుదఫాలుగా చర్చించిన చంద్రబాబునాయుడును చిట్టచివరికి అధికారులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించినట్లుగా సాక్షి ఓ కథనం ప్రచురించింది.

అయితే ఇక్కడ తమాషా ఏంటంటే.. సీఐడీ అనుమతి లేకుండా చంద్రబాబు విదేశాలకు వెళ్లకూడదన్నది నిజమే అయితే.. ఆయన తన పర్యటన మొత్తం ప్లాన్ చేసేసుకుని. విమానాశ్రయం దాకా వెళ్లిపోయి, అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఆపినప్పుడు.. సీఐడీ అధికారులకు ఫోనుచేసి అనుమతులు తెప్పించుకున్నారా? అనేది అనుమానం. అలా జరిగి ఉంటే గనుక.. చంద్రబాబు పట్ల సీఐడీ అదికారులు చూసీ చూడనట్టుగా వ్యహరిస్తున్నారా? అనే సందేహం కూడా ప్రజల్లో కలుగుతోంది.