పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలమైంది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి పిల్లల్ని చూసుకుంటున్నారు. ఎవరి జీవితాలు వాళ్లు లీడ్ చేస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో ఇప్పటికీ చాలామంది రేణుదేశాయ్ పై విరుచుకుపడుతుంటారు. పవన్ తో కంపేర్ చేస్తూ, రేణు దేశాయ్ ను ట్రోల్ చేస్తుంటారు.
తాజాగా మరోసారి పవన్ అభిమానులకు టార్గెట్ అయింది రేణుదేశాయ్. ఆమె జంతు ప్రేమికురాలనే సంగతి అందరికీ తెలిసిందే. జంతు సంరక్షణ కోసం ప్రతి నెల కొంత మొత్తాన్ని కేటాయిస్తుంది. దీనికి సంబంధించి ఆమె విరాళాలు కూడా సేకరిస్తుంది.
తాజాగా మరోసారి అదే పని చేసింది. ఎప్పట్లానే ఈసారి కూడా ఆమెను పవన్ కల్యాణ్ తో పోల్చడం మొదలుపెట్టారు. కొంతమంది సమయం-సందర్భం లేకుండా తిట్లు కూడా స్టార్ట్ చేశారు. ఇలాంటి వాళ్లపై ఘాటుగా స్పందించింది రేణు దేశాయ్.
“నేను పెట్టే ప్రతి పోస్టును ఎందుకు నా మాజీ భర్తతో కంపేర్ చేస్తారు. ఇప్పటికే వందల మందిని నేను బ్లాక్ చేశాను. నేను ఒక స్వతంత్ర వ్యక్తిని, నా పదేళ్ల వయసు నుంచి జంతు సంరక్షణ చేస్తున్నాను. దీనికి నా మాజీ భర్తతో ఏంటి సంబంధం. దయచేసి ఇకపై నా ప్రతి పోస్టుకు పవన్ తో పోలిక తీసుకురావొద్దు.”
తను ప్రేమించినంతగా, పవన్ కల్యాణ్ జంతుప్రేమికుడు కాదని అంటోంది రేణు దేశాయ్. ఈ పోస్టును తను కోపంతో పెట్టడం లేదని, మనసు పొరల్లో నుంచి వచ్చిన బాధ వల్ల పెట్టానని తెలిపిన రేణు.. పవన్ తో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రాబ్లమ్ లేదని, అతడి ఫాలోవర్స్ తన ఇనస్టాగ్రామ్ పేజీని వదిలేయాలని కోరుతోంది.