ఎన్నికలు అయిపోయి అయిదు రోజులు గడిచినా కూడికలూ తీసివేతలూ వేసుకుంటూ గడుపుతున్నారు ప్రధాన పార్టీ అభ్యర్థులు. అక్కడ ఆ పాకెట్ లో అన్ని ఓట్లు వస్తాయి, ఇక్కడ ఇన్ని పోతాయి అనుకుంటూ అభ్యర్ధులు లెక్కలు కట్టుకుంటున్నారు.
తమ తమ పార్టీలకు చెందిన క్యాడర్ నుంచి పూర్తి వివరాలను సేకరిస్తూ వాటిని ఒకటికి రెండు సార్లు తరచి చూసుకుంటూ గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్నది అంచనా కట్టే పనిలో ఉన్నారు. అయితే ఎంత కూడినా మరెంత తీసినా కూడా డౌట్లు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయని అంటున్నారు.
అనుకున్న వారు అంతా ఓట్లేసారా లేక తమ క్యాడర్ చెప్పేది నిజమేనా వంటి సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారుట. చాలా మంది అభ్యర్ధులు పోలింగ్ రోజు చూపించిన ఉత్సాహం గెలుపు ధీమాలు అంతా రోజులు గడచే కొద్దీ తగ్గిపోతూ ఆ ప్లేస్ లో భయాందోళనలు పెరుగుతున్నాయని అంటున్నారు.
అందరికీ అంకెలు వచ్చి రెండు రెళ్ళు నాలుగు అని కూడా తెలుసు. కానీ ఇది రాజకీయ గణితం. అందువల్ల రెండు రెండూ కలుస్తాయో తెలియవు. కలిసినా ప్లస్ అవుతాయో లేదో అంతకంటే తెలియదు. దాంతోనే మల్లగుల్లాలు పడుతున్నారుట.
ఒక ఇంట్లోనే రెండు మూడు పార్టీలకు ఓట్లేసిన సందర్భం ఉంది. దాంతో ఎవరు ఎవరికి ఓటెత్తారు, ఎవరు జై కొట్టారు అన్నది అర్ధం చేసుకోవడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదని అంటున్నారు. దాంతోనే మునుపటి మాదిరిగా ఒక కచ్చితమైన అంచనాలు రాలేకపోతున్నామని నిట్టూరుస్తున్న వారూ ఉన్నారు.
కొందరు అయితే మీడియాకే ముఖం చాటేస్తున్నారు. మీడియా ముందు గెలుస్తామని చెప్పి ఆనక ఫలితం బోల్తా కొడితే అపుడు ముఖం ఎత్తుకోలేమని భావించే ముందు జాగ్రత్త పడుతున్నారు అని అంటున్నారు. కొత్త గుర్తులు ఎక్కువైతే తంటా అని అంటారు. అలా కూటమి కష్టాలు వారికి ఉంటే వైసీపీకి ఒకే గుర్తు అయినా క్రాస్ ఓటింగ్ బెడద పట్టి పీడిస్తోందిట. ఇవన్నీ చూసిన వారు ఎపుడెపుడు జూన్ 4 వస్తుందా ఈ టెన్షన్ తీరుతుందా అని మాత్రమే ఆలోచిస్తున్నారుట.