ఓటేయని వారు ఉత్తముడు అని కొత్త సామెతను అలవాటు చేసుకుంటున్నారు సిటీలోని చాలా మంది. ఏ రాయి అయితేనేమి పళ్ళూడకొట్టుకోవడానికి అన్నది వారి సిద్ధాంతం కాబోలు. మండె ఎండలలో ఓటేసి వస్తే లాభమేంటి అని అనుకున్నారో లేక ఇంతకంటే వేరే ముఖ్యమైన పనులు ఉన్నాయో తెలియదు కానీ విశాఖ పార్లమెంట్ పరిధిలో ఓటేయని వారి సంఖ్య అచ్చంగా అయిదు లక్షల 56 వేల 819 మందిగా లెక్క తేలింది. విశాఖ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 19 లక్షల, 27 వేల 303 గా ఉంది.
ఇందులో ఓట్లేసిన వారు 13 లక్షల 70 వేల 484 మందిగా అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతం గతం కంటే పెరిగింది అని కూడా చెబుతున్నారు. అయితే పోలింగ్ శాతం ఏపీలో ఈసారి రికార్డు స్థాయిలో ఉన్నది. 81.86 శాతంగా అది నమోదు అయింది. ఇంతలా ఓటర్ల చైతన్యం వెల్లి విరిసినా విశాఖలో మత్రం ఎంపీ సీటుకు అత్యల్పంగానే పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం. 71.11 శాతం ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దాంతో ఓటర్లు ఎందుకు బయటకు రాలేదు అన్న డిస్కషన్ సాగుతోంది. విశాఖలో అన్ని వర్గాల ప్రజలూ ఉంటారు. అపార్ట్మెంట్ కల్చర్ కూడా ఉంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వ్యాపారులు ఇలా అనేకా రకాల వారు ఉన్నారు.
వారు ఓటుకు ముందుకు రాకపోవడం పట్ల మేధావులు సైతం పెదవి విరుస్తున్నారు. విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఓటింగ్ శాతం రాష్ట్రంలో మిగిలిన చోట్లతో పోలిస్తే తక్కువగానే ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే విపక్షం మీద నమ్మకం లేకపోతే నోటాకు ఓటు వేయవచ్చు కదా అన్న వారూ ఉన్నారు.
రాజ్యాంగం అందించిన ఓటు హక్కుని ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదు అన్న ప్రశ్నకు జవాబు అయితే లేదు. తాయిలాలు అందలేదని కూడా కొంతమంది ఓటింగు కి దూరంగా ఉంటే చాలా మందికి విశాఖతో పాటు సొంతూళ్ళ లోనూ రెండవ ఓటు ఉండడంతో వారి ఓటు అలా వేస్ట్ అయింది అని అంటున్నారు కారణాలు ఏమైనా ఓటింగు దూరంగా ఆరు లక్షల మంది విశాఖ వంటి సిటీలో ఉన్నారు అంటే అది ఆశ్చర్యమే అని అంటున్నారు.