చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత ఖరీదైన ఎలక్షన్లుగా నిలుస్తున్నాయి 2024 సార్వత్రిక ఎన్నికలు. వేల కోట్ల రూపాయల ధన ప్రవాహం జరుగుతోంది. లెక్కలు చూపించని డబ్బు లెక్కలేనంతగా మార్కెట్లోకి వచ్చింది. మద్యం, బంగారం, ఉచిత బహుమతులకైతే కొదవలేదు.
దేశవ్యాప్తంగా ఎన్నికలు ఎంత ఖరీదైపోయాయో.. ఎన్నికల సమయంలో పట్టుబడిన నగదు, బంగారం లెక్కలు చూస్తే ఇట్టే అర్థమౌతుంది. తాజాగా ఈ వివరాలు బయటకొచ్చాయి. అత్యధికంగా గుజరాత్ లో నగదు, బంగారం, మాదకద్రవ్యాలు పట్టుబడగా.. రెండో స్థానంలో రాజస్థాన్ నిలిచింది.
ఎన్నికల వేళ గుజరాత్ రాష్ట్రంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం అక్షరాలా 1461 కోట్ల రూపాయలు. వీటిలో నగదు రూపంలో దొరికింది కేవలం 8.61 కోట్లు మాత్రమే. 1187 కోట్ల రూపాయల ఖరీదైన డ్రగ్స్ పట్టుబడ్డాయి.
ఇక 1133 కోట్ల రూపాయలతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో లెక్క చూపని డబ్బు 42 కోట్ల రూపాయలు దొరకగా.. రూ.216 కోట్ల డ్రగ్స్, 756 కోట్ల రూపాయల బహుమతులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ నగదు విషయానికొస్తే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ నుంచి అత్యథికంగా 114 కోట్ల 41 లక్షల రూపాయల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు ఇతర బహుమతులు, బంగారం, డ్రగ్స్, మద్యంతో కలిపి రూ. 333 కోట్ల రూపాయల మొత్తాన్ని తెలంగాణ నుంచి పోలీసులు సీజ్ చేశారు. అత్యథికంగా నగదు పట్టుబడింది తెలంగాణలోనే.
ఇక ఆంధ్రప్రదేశ్ లో 301 కోట్ల 75 లక్షల రూపాయల మొత్తాన్ని పోలీసులు సీజ్ చేశారు. వీటిలో అక్రమ నగదు విలువ 85 కోట్ల రూపాయలు కాగా.. అక్రమంగా తరలిస్తున్న బంగారం విలువ రూ. 142 కోట్లు.
ఓవరాల్ గా చూసుకుంటే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8889 కోట్ల 74 లక్షల రూపాయల మొత్తాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఇంకా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో, సీజ్ చేసిన మొత్తం విలువ 9వేల కోట్ల రూపాయలు దాటుతుందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది.
ఎన్నికల వేళ దేశంలో చలామణి అయిన బంగారం, ఉచిత బహుమతులు, డబ్బు, మద్యంతో పోలిస్తే.. పట్టుబడిన మొత్తం కేవలం 5 శాతం మాత్రమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన దేశంలో ఎన్నికలు ఎంత కాస్ట్ లీ అయిపోయాయో అర్థం చేసుకోవచ్చు.