శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈసారి పోలింగ్ సరళి చాలా ఆసక్తికరంగా సాగింది. ఇచ్చాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా మహిళను నిలబెట్టారు. ఈసారి ఓటింగ్ శాతం చూసినా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారు.
ఇచ్చాపురంలో పోలింగులో పాల్గొన్న పురుష ఓటర్ల శాతం 65.49 గా ఉండగా, మహిళా ఓటర్ల శాతం 75.36 గా ఉంది. మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉండడంతో మహిళా అభ్యర్థిగా తననే ప్రజలు ఆదరించారని తాను కచ్చితంగా విజయం సాధిస్తానని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొదటి నుంచి ఇచ్చాపురం సీటుని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. జగన్ ఎన్నికల ప్రచారం సైతం ఇచ్చాపురంలో నిర్వహిస్తే ఇసుక వేస్తే రాలనంత జనం హాజరయ్యారు. దాంతో పాటు ఈసారి వైసీపీ వైపుగా పాజిటివ్ వైబ్స్ కనిపించాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇచ్చాపురంలో ఈసారి మార్పు కచ్చితంగా ఉంటుందని, 2004లో కాంగ్రెస్ గెలిచిన తరువాత గత ఇరవై ఏళ్లలో మరో పార్టీ గెలవలేదని టీడీపీకే ఓటర్లు పట్టం కడుతూ వస్తున్నారని అంటున్నారు. ఈసారి మాత్రం వైసీపీ వైపు ఓటర్లు మొగ్గు చూపారని ఆ పార్టీ భావిస్తోంది. పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లు పది శాతం ఎక్కువగా ఓటు చేయడంతో ఇదంతా నారీ శక్తిగానే భావిస్తున్నారు. ఈ లెక్కలు అన్నీ చూసిన వైసీపీ నేతలు తొలిసారి ఇచ్చాపురానికి మహిళా ఎమ్మెల్యే రాబోతున్నారు అని అంటున్నారు. అసలు ఫలితం ఏమిటి అన్నది జూన్ 4న చూడాల్సి ఉంది.