విచిత్రంగా వ్యవహరించే పొలిటికల్ లీడర్స్ లో కొంతకాలం కిందట బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి అందులో లేనట్లుగానే ఉంటున్న విజయశాంతి అలియాస్ రాములమ్మ ఒకరు. బీజేపీలో అసంతృప్తిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి ఈ పార్టీలోనూ అసంతృప్తిగానే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరిక రెండోసారి. ఒకసారి అసంతృప్తితోనే కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి బీజేపీలో చేరింది.
అక్కడా ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తితో కాంగ్రెస్ లోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి అసంతృప్తిగానే ఉంది. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా మౌన వ్రతం పాటించింది. ఎన్నికలు ముగిశాకా సైలెంట్ గానే ఉంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి మద్దతుగా పెట్టిన పోస్టు ఆమెపై అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. రాజకీయాల్లో ఎవరేం మాట్లాడినా ఎందుకలా మాట్లాడారని అనుమానాలు కలుగుతుంటాయి. ఇప్పుడు గులాబీ పార్టీకి మద్దతుగా రాములమ్మ మాట్లాడటంపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదని కామెంట్ చేశాడు. దీనికి ఆ పార్టీ వాళ్ళు కాకుండా విజయశాంతి కౌంటర్ ఇవ్వడంతో ఇది చర్చనీయాంశమైంది. గులాబీ పార్టీ ఎప్పటికీ కనుమరుగు కాదని చెప్పింది. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమని చెప్పింది. ఇది అర్థం కాకుండా వ్యవహరించడం కరెక్టు కాదని చెప్పింది.
దక్షిణాదిలో దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుంచి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఎన్నడైనా ఇదే వాస్తవమని అన్నది. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశమని విజయశాంతి చెప్పింది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఉండదని కాంగ్రెస్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి సహా చాలామంది అన్నారు. కానీ విజయశాంతి ఎప్పుడూ వాళ్ళ కామెంట్స్ ను ఖండించిన దాఖలాలు లేవు. కానీ కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్న రాములమ్మ, ఎన్నికల్లో ఇసుమంత కూడా ప్రచారం చేయని రాములమ్మ ఇప్పుడు ఉన్నట్టుండి గులాబీ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది.
రాజకీయ నాయకులు కొన్ని విషయాలు అతిశయోక్తిగా మాట్లాడుతుంటారు. కిషన్ రెడ్డి కామెంట్ కూడా అటువంటిదే. కానీ కాంగ్రెస్ నాయకురాలైన విజయశాంతి దాన్ని ఎందుకు కౌంటర్ చేసింది అన్నదే చర్చనీయాంశమైంది. ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి గులాబీ పార్టీలోకి వెళుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడెలా వ్యవహరిస్తుందో తెలియని విజయశాంతి గులాబీ పార్టీలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.