దేశంలో ఎక్కడా బీజేపీ నేతృత్వంలో పాలన వుండకూడదని కమ్యూనిస్టులు కోరుకుంటుంటారు. అదేంటో గానీ, ఏపీకి వచ్చే సరికి సిద్ధాంతాలు పక్కకుపోతున్నాయి. జగన్ సర్కార్ కూలిపోయి, బీజేపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మహదానందం పొందుతున్నారు.
సీపీఐ నేతల్ని చూస్తే జాలి కలుగుతుంది. వీరి మనసు ఒక చోటు, మనుషులు మరో చోట ఉన్నారు. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లాలని సీపీఐ నేతలు అనుకున్నారు. అయితే ఆ రెండు పార్టీల లెక్కలు వేరు. సీపీఐతో పొత్తు పెట్టుకుంటే ప్రయోజనం లేదని, ఆ పార్టీని పక్కన పెట్టారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో ఇండియా కూటమి అంటూ కాంగ్రెస్‌తో కలిసి వామపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి.
ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వెలువడాల్సి వుంది. కానీ అంత వరకు వేచి చూసేంత ఓపిక సీపీఐకి లేదు. సిద్ధాంతపరంగా తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని రామకృష్ణ సంబరపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కూలిపోవడం, కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. జగన్‌పై వ్యక్తిగతంగా ఎంత ద్వేషాన్ని నింపుకున్నారో ఈ కామెంట్స్ తెలియజేస్తున్నాయి.
బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనా సీపీఐకి ఆమోదమే. బీజేపీ సిద్ధాంతాల్ని కమ్యూనిస్టులు విభేదిస్తారనేది ఉత్తుత్తిదే అని రామకృష్ణ మరోసారి నిరూపించారు. కేవలం సమాజం ఛీత్కరించుకుంటుందనే ఏకైక కారణంతో కూటమితో కలిసి సీపీఐ పని చేయలేదన్నది వాస్తవం. సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ “కమ్మ”నిజాన్ని బాగా ఒంటబట్టించుకున్నారు. దాని నుంచి వాళ్లు బయటపడకపోవడం వల్లే సిద్ధాంత పట్టింపు లేకుండా పోయింది.