ఓట‌ర్ల క‌సి.. అధికార ప‌క్షంపైనా? ప్ర‌తిప‌క్షం మీదా?

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎవరు గెలుస్తారనే దానిపై చర్చోప చర్చలు సాగుతున్నాయి. పార్లమెంటు స్థానాల సంగతి పక్కనబెడితే.. ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు వస్తాయి, రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు…

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎవరు గెలుస్తారనే దానిపై చర్చోప చర్చలు సాగుతున్నాయి. పార్లమెంటు స్థానాల సంగతి పక్కనబెడితే.. ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు వస్తాయి, రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ ఇద్దరు కలిసినా ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. ఇదే ప్రధాన ఏజెండాగా వాదోపవాదాలు జరుగుతున్నాయి.

అధికార వైసిపి తాము మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే.. ఎన్‌డిఏ కూటమి విజయం ఖాయమని టిడిపి, జనసేన, బిజెపి నాయకులు చెబుతున్నారు.

గత ఎన్నికలతో పోల్చితే ఓటింగ్‌ శాతం పెరిగిందని, ప్రభుత్వంపై కోపంతో కూటమి అభ్యర్థులను గెలిపించడానికే ఓటర్లు పోటెత్తి కసిగా ఓట్లు వేశారని కూటమి నేతలు విశ్లేషిస్తుంటే.. కూటమి గెలిస్తే ఇప్పటిదాకా అమలవుతున్న సంక్షేమ పథకాలు పోతాయన్న భయంతో మహిళలు, వృద్ధులు, పేదలు తరలివచ్చి ఓట్లు వేశారని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

ప్రభుత్వం మీద అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వుందని  కూటమి నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే.. ఆ వ్యతిరేకత ఎలావుందో మాత్రం ఇప్పటిదాకా చెప్పలేదు. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిందని అందరూ అంగీకరిస్తున్నారు. సంక్షేమ పథకాలతో దేశాన్ని శ్రీలంక చేసేస్తున్నారంటూ టిడిపి పదేపదే ఎద్దేవా చేసింది. 90 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాయని ప్రభుత్వం ప్రకటించింది. అలాంటప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకొస్తుందనేది ప్రశ్న. ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు అందుకున్న వారిలో ప్రభుత్వాన్ని ఓడించాలన్నంత వ్యతిరేకత ఎందుకు వుంటుందో తెలుగుదేశం చెప్పడం లేదు. ఈ వాదన అంత సహేతుకంగా లేదు. అందువల్ల పేదల ఓట్లు టిడిపికి పడ్డాయని భావించలేం. 

తాము ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలు విశేషంగా ఆకట్టుకున్నాయని చంద్రబాబు చెబుతున్నారు. వాస్తవంగా జగన్‌ మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న పథకాలనే ఇంకాస్త పెంచి ప్రకటించారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఇవే పథకాలను అమలు చేస్తున్న జగన్‌ ప్రభుత్వంపై టిడిపి కొన్నేళ్లుగా విమర్శలు చేస్తూనే వుంది. ఈ పథకాలతో రాష్ట్రం అప్పుల పాలైపోయిందని తన అనుకూల పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా కథనాలు వండి వర్చారు. ఎన్నికలొచ్చేసరికి అకస్మాత్తుగా సూపర్‌ సిక్స్‌ అంటూ పథకాలు ప్రకటించారు. దీన్ని ఓటర్లు ఎంత వరకు విశ్వసించారన్నది కీలకమైన ప్రశ్న. ఈ విషయంలో చంద్రబాబుకు వున్న ప్రధాన సమస్య విశ్వసనీయత. అందువల్ల సూపర్‌ సిక్స్‌ను ఓటర్లు సీరియస్‌గా తీసుకోలేదని రాజకీయ పండితులు చెబుతున్నమాట.

టిడిపి ఆశపెట్టుకున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రథమ స్థానంలో వున్నారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాల విషయంలో కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నమాట వాస్తవం. దీంతో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వున్నమాట కూడా వాస్తవమే. అయితే… ఆ వ్యతిరేకత ఎంతన్నది ప్రశ్న. జగన్‌ను మించి చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఉద్యోగులకు గతంలో చంద్రబాబుకు వున్న అనుభవాలు, విశ్వసనీయత అన్నీ చర్చనీయాంశంగా మారాయి. దీనివల్ల ఎన్నికల నాటికి 30 నుంచి 40 శాతం ఉద్యోగులు కూడా జగన్‌ వైపు మొగ్గు చూపారన్నది ఆ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ విధంగా చూసినపుడు ఉద్యోగుల ఓట్లన్నీ గంపగుత్తుగా టిడిపికి పడలేదన్నది వాస్తవం. ఎంఎల్‌సి ఎన్నికలు కూడా ఈ నిర్దారణనే ధ్రువీకరించాయి. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసిపి విజయం సాధించింది.

తెలుగుదేశం కూటమికి కాస్త ఏకపక్షంగా ఓట్లు వేసింది ఎగువ మధ్య తరగతి మాత్రమే. జగన్‌ మోహన్‌ రెడ్డి…సంక్షేమ పథకాల పేరుతో పేదలకు డబ్బులు పంచేస్తూ, అభివృద్ధిని పట్టించుకోలేదని నమ్మతూ, తెగబాధపడిపోయిన అతి తక్కువ శాతంగా వున్న ఈ వర్గం ఓటర్లు మాత్రం కూటమి వైపు మొగ్గు చూపారు. అయితే…ఈ ఓటర్ల శాతం తక్కువే కాదు…పోలింగ్‌ శాతం కూడా తక్కువే.

ఇక కూటమికి అననుకూలమైన అంశాలు లెక్కకుమించి వున్నాయి. వాలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు చేర్చింది. ఏ పనైనా సులభంగా అయిపోతుండటంతో ప్రజల్లో ఈ వ్యవస్థల పట్ల ఎనలేని ఆదరణ వ్యక్తమయింది. ఇటువంటి వ్యవస్థలపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు కూటమికి చెప్పలేనంత చేటు తెచ్చాయని చెప్పాలి. 

వాలంటీర్లను మనుషులను అపహరించే ముఠాలతో పోల్చడం, ఎన్నికల సమయంలో వాలంటీర్లను పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకోవడం….వాలంటీర్లతో పాటు పింఛనుదారుల ఆగ్రహానికి గురయ్యారు. జగన్‌ ఓడిపోయి చంద్రబాబు గెలిస్తే…అమ్మఒడి, రైతుభరోసా, చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలు ఆగిపోతాయన్న భయం మహిళలను ఆవహించింది. ఎందుకంటే ఈ పథకాల డబ్బులన్నీ మహిళల ఖాతాల్లోనే జమయ్యాయి. ఈ ఐదేళ్లలో ఎంత డబ్బులు వచ్చాయో మహిళలకే బాగా తెలుసు. మహిళల్లో అత్యధిక శాతం ఓట్లు టిడిపికి వ్యతిరేకంగా పడ్డాయన్నది పరిశీలకుల అంచనా. 

ఇక ఎస్‌సిలు, ఎస్‌టిలు, మైనారిటీలు మొదటి నుంచి వైసిపితో వున్నారు. తెలుగుదేశంతో లేరు. ఎస్‌సిల్లో మాదిగలు మాత్రమే టిడిపికి కాస్త అనుకూలంగా వున్నారు. పథకాల ప్రభావంతో మాదిగల్లోనూ మహిళలు వైసిపికి అనుకూలంగా ఓటు వేశారన్నది ఒక అంచనా. 

మైనారిటీల విషయానికొస్తే….ముస్లిం మైనారిటీలు ఒకప్పడు టిడిపికి అనుకూలంగా వుండేవారు. ఆ తరువాత వైసిపి వైపు మొగ్గుచూపుతూ వచ్చారు. ఈసారి టిడిపి, జనసేన పార్టీలు బిజెపితో జతకట్టడం మైనారిటీల్లో ఆగ్రహం తెప్పించింది. ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని బిజెపి అధికారంగా ప్రకటించడంతో ఆ వర్గాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. కూటమిని ఓడిస్తామని బహిరంగంగానే ముస్లిం పెద్దలు ప్రకటించారు. 

అన్నింటికీ మించి చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత ప్రధాన సమస్యగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి, మోడీని నానా బూతులు తిట్టన చంద్రబాబు…దేశం కోసమే కాంగ్రెస్‌తో కలిశానని చెప్పుకున్న చంద్రబాబు…ఈ ఎన్నికల్లో బిజెపితో జతకట్టారు. మోడీని విశ్వగురువు అంటూ ఆకాశానికెత్తారు. మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తామే గెలిపించామని చెప్పుకున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి హ్యాండ్‌ ఇచ్చి బిజెపితో జతకట్టడం పచ్చి అవకాశవాదంగా జనం గమనించారు.

ఇవన్నీ విశ్లేషించాక….జనం పోటెత్తి టిడిపి కూటమికి ఓటు వేశారన్నా, ఆ కూటమి విజయం సాధిస్తుందన్నా నమ్మలేని పరిస్థితి కనిపిస్తున్నది.

ఈ ఎన్నికల్లో తామే భారీ విజయం సాధిస్తామని జగన్‌ చెబుతున్న మాటలకు ఆధారాలు కనిపిస్తున్నాయి. జగన్‌ సంక్షేమ పాలన దేశంలోనే కనీవినీ ఎరుగనిది. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎక్కడా లేనిది. 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమేగాదు…జగనన్న కాలనీల పేరుతో ఊర్లకు ఊర్లు నిర్మాణం అవుతున్నాయి. రాష్ట్రంలోని 10 శాతం కుటుంబాలు మినహా అన్ని కుటుంబాలకూ ఏదో విధంగా ప్రయోజనం పొందాయి. లక్ష రూపాయల నుంచి రూ.15 లక్షల దాకా లబ్ధిపొందిన కుటుంబాలున్నాయంటే ఆతిశయోక్తి కాదు. ఇదే వైనాట్‌ 175 అని అంటున్న జగన్‌ ధైర్యం. 

జగన్‌ ప్రభుత్వం మీద తెలుగుదేశం, జనసేన కలిసి చేసిన దాడి అంతా ఇంతా కాదు. ఒకసారి గుర్తుచేసుకుంటే…జగన్‌ ప్రభుత్వాన్ని అడుగుతీసి అడుగు వేయనీకుండా అడ్డుకున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే కోర్టులో కేసు, ఇంగ్లీషు మీడియం పెట్టాలంటే కేసు, ఇంటింటికీ రేషన్‌ ఇస్తానంటే కేసు, వాలంటీర్లపైన కేసు, సచివాలయ వ్యవస్థపైన కేసు, స్థానిక ఎన్నికలు జరపాలంటే కేసు….ఇలా కోర్టు కేసులతో అమరావతి నుంచి ఢిల్లీ దాకా జగన్‌ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన తీరు ప్రజాస్వామికవాదులను ఆందోళనకు గురి చేసింది. వాస్తవంగా అధికారపక్షం వల్ల ప్రతిపక్షం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం వల్ల అధికారపక్షం దాడికి గురయింది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గమనించారు. 

రాజధాని పేరుతో అమరావతిలో లక్షల కోట్లు కుమ్మరించే విధానం వద్దని, మూడు రాజధానులు ఏర్పాటు చేసి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని జగన్‌ ప్రకటించిన క్షణం నుంచి ఇప్పటిదాకా ఆ అంశంపైన జరుగుతున్న దాడి విస్తుపోయేలా చేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ కంటే కేంద్రీకరణే మంచిదనే ఒక అభిప్రాయాన్ని జనం మీద రుద్దడానికి పచ్చబ్యాచ్‌ చేయని ప్రయత్నం లేదు. తమ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న భావన ఇటు రాయసీమ, అటు ఉత్తరాంధ్ర ప్రజల్లో ఏర్పడింది. 

కరోనా సమయంలో రెండేళ్లపాటు జగన్‌ పథకాలు లేకుంటే జనం విలవిల్లాడిపోయేవారు. ఈ విషయాన్ని జనం గుర్తించారు. చంద్రబాబు మాత్రం ఇవన్నీ దాచిపెట్టి…జగన్‌ అప్పులు తెచ్చి పప్పులు బెల్లాలు పంచుతున్నట్లు పంచుతున్నారంటూ రోజూ ప్రచారం హోరెత్తించారు. పేదలకు ఇస్తున్న డబ్బుపై ఇలా మాట్లాడటం ఆ వర్గం ప్రజల్లో తెలియకుండానే చంద్రబాబుపై ఆగ్రహం తెచ్చిపెట్టింది. జగన్‌ ప్రభుత్వాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న పట్టుదలను పేదల్లో పెంచింది. 

నిన్నటికి నిన్న వాలంటీర్ల ద్వారా పింఛను ఇవ్వనీకుండా ఎన్నికల సంఘం ద్వారా అడ్డుకున్నారు. దీంతో వృద్ధులు, వికలాంగులు పడిన అవస్థలు అన్నీఇన్నీ కావు. చంద్రబాబు వస్తే ఇదే పరిస్థితి వుంటుందన్న భయం వారిలో నెలకొంది. అందుకే జగన్‌ను మళ్లీ గెలిపించుకోవాలన్న భావన వృద్ధులు, వికలాంగుల్లో ఏర్పడిందన్నది వైసిపి అంచనా.

సాధారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆ వ్యతిరేకత ఓటుగా మారితే…ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని విజయం వరిస్తుంది. అధికార పక్షం ఓటమిపాలవుతుంది. అయితే…ఇప్పుడు జరిగింది వేరు. ప్రతిపక్షం చేసిన కుతంత్రాలతో జనంలో ఆ పక్షంపై వ్యతిరేకత ఏర్పడిందన్నది వైసిపి అంచనా. అందుకే ఆ పక్షాన్ని మరింత గట్టిగా దెబ్బతీయడానికి ఓటర్లు కసిగా ఓట్లు వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ప్రతిపక్షం మీద ఓటర్లలో కసివుంటే.. జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పినట్లు వైసిపికి గతం కంటే ఎక్కువ సీట్లు రావడం ఖాయం. దేశం మొత్తం నిబిడాశ్ఛర్యంతో ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడటం ఖాయం. 

-ఆదిమూలం శేఖర్‌, సీనియర్‌ జర్నలిస్టు