వైనాట్ కుప్పం నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ…ఆ లక్ష్య సాధనలో సక్సెస్ అవుతామనే ధీమాతో వుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పంలో చంద్రబాబునాయుడిని ఈ సారి మట్టి కరిపించబోతున్నామని వైసీపీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. దీనికి తాము పన్నిన ఎన్నికల వ్యూహమే కారణంగా వైసీపీ నేతలు చెబుతున్నారు.
వైసీపీ చెబుతున్న లాజిక్ ప్రకారం కుప్పంలో చంద్రబాబునాయుడికి సినిమా కనిపించేలా వుంది. గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీని భారీగా తగ్గించారు. వైసీపీ అభ్యర్థిపై చంద్రబాబునాయుడు 30,722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పం బాధ్యల్ని అప్పగించారు. దీంతో మంత్రి కుప్పంలో తరచూ పర్యటిస్తూ, వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కుప్పం మున్సిపాలిటీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. స్థానిక సంస్థల ఫలితాలు వైసీపీలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపాయి. అందుకే కుప్పంలో చంద్రబాబునాయుడిని మాత్రం ఎందుకు ఓడించలేమనే ఆలోచన వైసీపీ నేతల్లో బలపడింది. అందుకు తగ్గట్టుగా వ్యూహ రచన చేస్తూ వచ్చారు.
ఎన్నికలు ముగిశాయి. కుప్పంలో తాము గెలవబోతున్నామని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. కుప్పంలో టీడీపీ నమోదు చేయించిన 35 వేల దొంగ ఓట్లు తొలగించడం, మరోవైపు వైసీపీ తమకు అనుకూలంగా ఉన్న 15 వేల ఓట్లు ఎక్కించడం. ఇంతకాలం చంద్రబాబుకు వస్తున్న మెజార్టీ అంతా దొంగ ఓట్ల పుణ్యమే అని వైసీపీ నేతలు అంటున్నారు. బాబు దొంగ ఓట్లలో సుమారు 75 శాతం తొలగించామనేది వైసీపీ వాదన.
కుప్పంలో వైసీపీకి సానుకూల వాతావరణం ఏర్పడిందని, సంక్షేమ పథకాల లబ్ధిదారులు పెద్ద ఎత్తున తమ వైపు నిలిచారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో కుప్పంలో గెలుస్తామనే ధీమా వైసీపీలో కనిపిస్తోంది