ఈ దఫా ఏపీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అధికారంలోకి రారని ఎంతో ముందుగానే అందరికీ అర్థమైంది. దానికి కారణం.. చంద్రబాబు అధ్వాన్నమైన పాలనే. అయితే ఈ సారి అధికారం ఎవరిదో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఓటరు నాడిని పసిగట్టలేకపోతున్నారు.
దీంతో తమ అభిమానానికి తగ్గట్టు అధికారంపై లెక్కలేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాదనేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చంద్రబాబు ప్రకటించిన సూపర్సిక్స్కు తోడు మరిన్ని పథకాలపై జనాకర్షణగా చెబుతున్నారు. మరోవైపు వైఎస్ జగన్ కొత్తగా ఎలాంటి పథకాలు ప్రకటించలేదని అంటున్నారు. అలాగే జగన్పై ఉద్యోగుల వ్యతిరేకత, ఉన్నత వర్గాల ఆగ్రహాన్ని చూపుతున్నారు. వీటికి అదనంగా ఎన్నికల సంఘం మద్దతు తోడైందని కూటమి అనుకూల నేతలు విశ్లేషిస్తున్నారు.
ఇవన్నీ పరిగణలోకి తీసుకునే తాము అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. తమకు ప్రతికూల అంశాలున్నట్టే, టీడీపీకి లేవా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. పొత్తు పెట్టుకోవడం, జనసేన, బీజేపీకి కొన్ని సీట్లు ఇవ్వడం నెగెటివ్ కాదా? అని జగన్ ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసింది. అలాగే మేనిఫెస్టో విషయంలో బీజేపీ దూరంగా ఉండడం ద్వారా… దాని విశ్వసనీయత పూర్తిగా పోయిందని జగన్ అభిప్రాయం.
అలాగే చంద్రబాబుకు విశ్వసనీయత లేకపోవడంతో, ఆయన ఇచ్చిన హామీలపై జనం ఆసక్తి చూపలేదని జగన్ తన సన్నిహితుల వద్ద అన్నట్టు తెలిసింది. 2014 కూటమి మేనిఫెస్టోను పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లి, బాబు ఏ విధంగా మోసగిస్తారో చెప్పడం వల్ల తాజా కూటమి మేనిఫెస్టోపై ప్రజల దృష్టిని మళ్లించగలిగామని జగన్ అన్నట్టుగా తెలిసింది.
బాబు విశ్వసనీయతపై తన విశ్వసనీయత విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే 150కి పైగా సీట్లు సాధిస్తామని జగన్ చెప్పడాన్ని వైసీపీ ముఖ్యులు గుర్తు చేస్తున్నారు.