విశాఖ ఎంపీ సీటు కోసం 33 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అందులో వివిధ రాజకీయ పార్టీల నుంచే కాదు, ఇండిపెండెంట్లు కూడా పోటీ చేశారు. ప్రజాశాంతి తరఫున కేఏ పాల్ పోటీ చేశారు. ఆయనకు కుండ గుర్తు ని కేటాయించారు. ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ ఎన్నో రకాల విన్యాసాలు చేశారు. కుండను తయారు చేస్తూ వారితో కలసి పోయారు. తన కుండలో ఓట్లు నింపాలని కోరారు. విశాఖ అభివృద్ధి కావాలంటే తనకే ఓటు వేయాలని ఆయన కోరారు.
స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ఆపింది కూడా తానే అని అన్నారు. పోలింగ్ ముగిసింది మేమే గెలుస్తామని ఎవరూ ఇప్పటిదాక చెప్పలేదు కానీ కేఏ పాల్ మాత్రం తనకు వచ్చే ఓట్లు ఎన్నో చెప్పి మరీ తోటి అభ్యర్థులకు షాక్ తినిపించారు. మొత్తం పోల్ అయిన ఓట్లలో తనకు పది లక్షలకు పైగా ఓట్లు వస్తాయని పాల్ ధీమాగా చెబుతున్నారు. ఇందులో బడుగు బలహీన వర్గాల వారితో పాటు యువత స్టీల్ ప్లాంట్ ఉయ్దోగులు అంతా ఓటు వేశారు అని పాల్ చెప్పారు.
మొత్తం పోల్ అయిన ఓట్లు 14 లక్షలు ఉంటే అందులో తనకే పది లక్షల ఓట్లు వచ్చాయని ఆయన అంటున్నారు. తాను చేసుకున్న చేసుకున్న సర్వేలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయని పాల్ అంటున్నారు. తాను నెగ్గినట్లే అని మీడియాకు చెప్పి ఆశ్చర్యపరిచారు. అంతే కాదు తొలి వంద రోజులలో విశాఖ ఎంపీగా తాను చేయాల్సిన పనుల గురించి యాక్షన్ ప్లాన్ కూడా రిలీజ్ చేస్తామని అంటున్నారు. విశాఖ ఎంపీగా తన గెలుపు ఖాయం అయిందని పాల్ చెప్పుకోవడం పట్ల అంతా చర్చించుకుంటున్నారు.
ఏపీలో అతి తక్కువ పోలింగ్ జరిగింది విశాఖ ఎంపీ సీటులోనే. ఇక్కడ ఇరవై లక్షలకు పైగా ఓట్లు ఉంటే కేవలం 14 లక్షలు మాత్రమే పోల్ అయ్యాయి. దీంతో ప్రధాన పార్టీలలో టెన్షన్ మొదలైంది. కానీ కేఏ పాల్ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా తానే ఎంపీ మీకేమైన డౌటా అని ప్రశ్నిస్తున్నారు. పాల్ వైఖరి మాత్రం విశాఖ రాజకీయాల్లో ఆసక్తిగానే ఉంది.