మ‌గాడి జీవితం.. అంత తేలిక కాదు!

ఒత్తిడి అన్ని వైపుల నుంచి, టీనేజ్ నుంచే మ‌గ‌వాడిపై ప్ర‌త్యేక ఒత్తిడి మొద‌ల‌వుతుంది! బాగా చ‌దువుకోవాలి ఎందుకంటే భ‌విష్య‌త్తుల్లో మంచి ఉద్యోగం రావాలంటే అప్ప‌టి నుంచినే బాగా చ‌ద‌వాలి! ఆడ‌పిల్ల స‌రిగా చ‌ద‌వ‌కపోతే పెళ్లి…

ఒత్తిడి అన్ని వైపుల నుంచి, టీనేజ్ నుంచే మ‌గ‌వాడిపై ప్ర‌త్యేక ఒత్తిడి మొద‌ల‌వుతుంది! బాగా చ‌దువుకోవాలి ఎందుకంటే భ‌విష్య‌త్తుల్లో మంచి ఉద్యోగం రావాలంటే అప్ప‌టి నుంచినే బాగా చ‌ద‌వాలి! ఆడ‌పిల్ల స‌రిగా చ‌ద‌వ‌కపోతే పెళ్లి చేసి పంపించేస్తాం.. నీకు ఎవ‌డైనా పిల్ల‌నివ్వాలంటే నువ్వు బాగా చ‌దువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి! అప్పుడే నీ జీవితం స‌వ్యంగా ఉంటుందంటూ 15 యేళ్ల వ‌య‌సు నుంచినే ఎక్స్ ట్రా ప్ర‌జ‌ర్ మొద‌ల‌వుతుంది! అమ్మాయిల‌ను కూడా చదువుకోమ‌నే అంటారు, మ‌హా అంటే.. స‌రిగా చ‌దువుకోక‌పోతే పెళ్లి చేసి పంపించేస్తాం.. అంటారు! అదే అబ్బాయి విష‌యంలో మాట తీరు మారుతుంది.   

అంద‌రికీ చ‌దువు రావాల‌ని లేదు! ఎవ‌రి టాలెంట్ వారికి ఉంటుంది, అయితే ప్ర‌స్తుత స‌మాజంలో చ‌దువుకుని వైట్ కాల‌ర్ జాబ్ చేస్తే త‌ప్ప ఎలాంటి విలువ లేకుండా పోయింది! ఉద్యోగం కూడా ఐటీ ఉద్యోగ‌మే కావాలి, ఇంకో ఉద్యోగం అయితే అబ్బే.. అంటారు! చ‌క్క‌గా వ్య‌వ‌సాయం చేయ‌లిగే వారికీ పిల్ల‌ను ఇవ్వ‌రు, ఏ చేతి ప‌నో చేసుకునేవాడి సంగ‌తి స‌రేస‌రి! వారిలో అవ‌స‌రం ఉన్న వ‌ర‌కూ ఓకే, ఆ త‌ర్వాత వారిని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు!   

కేవ‌లం పెళ్లి వంటి విష‌యాల్లోనే కాదు.. బాగా చ‌దువుకుని, ఉద్యోగం తెచ్చుకోలేక‌పోయినా, అందంగా క‌న‌ప‌డ‌క‌పోయినా, బాడీని మెయింటెయిన్ చేయ‌క‌పోయినా, బాగా మాట్లాడ‌లేక‌పోయినా, నైపుణ్యాలు లేక‌పోయినా.. మ‌గ‌వాడిపై ఎక్స్ ట్రా ప్ర‌జ‌ర్ అయితే ప్ర‌తి చోటా, ప్ర‌తి ద‌శ‌లోనూ ఉండ‌టం స‌హ‌జం అయిపోయింది. మంచి ఉద్యోగం చేస్తుండాలి, దాన్ని చూపించైనా గ్లామ‌ర‌స్ గ‌ర్ల్ ఫ్రెండ్ ను సంపాదించుకుని ఉండాలి! వాడే ఆల్ఫా మేల్! ఈ రెండూ లేక‌పోతే.. మ‌గ‌వాడిని సాటి మ‌గాడే చిన్న చూపు చూసే ప‌రిస్థితి కొన‌సాగుతూ ఉందిప్పుడు!

ఆడ‌దానికి ఆడ‌దే శ‌త్రువు అనేది పాత మాట‌! అయితే ఏ చిన్నది త‌క్కువ అయినా మ‌గ‌వాడిని ఇప్పుడు మ‌నిషిగా చూసే రోజులు కావు! ఉద్యోగం, డ‌బ్బు, అందం, ఆక‌ర్ష‌ణ ఇవ‌న్నీ మగాడికి ఉండాల్సిందే! లేక‌పోతే జీవితంలో చాలా రాజీ ప‌డి బత‌కాల్సిన ప‌రిస్థితుల్లో ఉన్నాడు మ‌గాడు!  ఈ ప‌రిస్థితుల గురించి అధ్య‌య‌నాలు చెబుతున్న మాట ఏమిటంటే.. మ‌గాడు ఒంట‌రి అయిపోతున్నాడ‌నేది! ప్ర‌స్తుత స‌మాజంలో స్త్రీల‌తో పోలిస్తే మ‌గవాళ్లు మానసికంగా ఒంట‌రి త‌నాన్ని ఎక్కువ‌గా ఫీల‌వుతున్నార‌ట‌! ప్ర‌తిదాంట్లోనూ అంద‌రూ జ‌డ్జిమెంట‌ల్ గా వ్య‌వ‌హ‌రిస్తూ ఉన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో మ‌గ‌వాళ్లు పోలిక‌ల‌తో విసిగిపోయే పరిస్థితి ఏర్ప‌డుతూ ఉంది.

స‌మాజం సెట్ చేసిన స్టేట‌స్ ను అందిపుచ్చుకోలేక‌పోయిన వాళ్లు మ‌నుషుల‌తో క‌ల‌వ‌డం కూడా త‌గ్గిపోతూ ఉంది.  ఉద్యోగం కాకుండా వ్య‌వ‌సాయం చేస్తున్నాడంటే.. ఒక 30 యేళ్ల యువ‌కుడిని చేత‌గాని వాడిగానూ, అస‌మ‌ర్థుడిగానూ, అయోగ్యుడిగానూ చూస్తూ ఉన్నారు.  ఉద్యోగం చేస్తూ ఉన్నా.. త‌న ఆస‌క్తి మేర‌కు కొత్త ర‌కం కెరీర్ వైపు వెళ్లాడంటే.. వాడినో పిచ్చివాడిగా చూస్తారు! డ‌బ్బులు బాగా వ‌చ్చే మార్గాల‌ను చూసుకోవాలి కానీ, అలాంటి ఉద్యోగం ఏమిటి? అంటారు!   

చ‌దువు స‌రిగా అబ్బక‌, ఏ వృత్తివిద్య‌నో అభ్య‌సించి డ‌బ్బులు సంపాదించే ప‌నినే చేస్తున్నా.. చిన్న చూపులు త‌ప్ప‌వు!  చ‌దువు, ఉద్యోగం ఉన్నా.. ఆక‌ర్ష‌ణ కూడా ఉండాల్సిందే! లేక‌పోతే ఇంకోర‌క‌మైన చిన్న చూపు! మంచి ఇంగ్లిష్ మాట్లాడాలి, బాధ్య‌తాయుతంగా ఉండాలి, అంద‌రి బాధ్య‌త‌ల‌నూ చూసుకోవాలి, త‌ల్లిదండ్రులు, అక్క‌చెల్లెళ్లు, భార్యాపిల్ల‌లు.. అంద‌రికీ అన్నీ స‌మ‌కూర్చిపెట్టాలి!

ఎక్క‌డ ఏ లోటు వ‌చ్చినా, ఏ చిన్న‌ది త‌క్కువ అయినా.. మ‌ళ్లీ మ‌గాడి జీవితంపై జ‌డ్జిమెంట్లు త‌ప్ప‌వు! ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మ ఆస‌క్తులు, ఇష్టాయిష్టాల‌తో నిమిత్తం లేకుండా సమాజం నిర్దేశించిన ప్ర‌మాణాల మేర‌కు బ‌త‌క‌డ‌మే మ‌గాడి ప‌నైపోయింది. తేడా రాకుండా చూసుకోవ‌డానికి తాప‌త్ర‌య‌ప‌డ‌ట‌మే జీవితం అయిపోయింది!