ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన కేసీఆర్ కుమార్తె కవిత తీహార్ జైల్లో ఉండబట్టి ఈరోజుతో సరిగ్గా రెండు నెలలైంది. ఆమెను మార్చి 15న హైదరాబాదులో ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ రోజుతో రెండు నెలలు పూర్తయ్యాయి. ఆమె బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరలేదు.
ఆమె బెయిల్ కు అప్లై చేసినప్పుడల్లా ఆమెని వదిలితే సాక్ష్యాలను తారుమారు చేస్తుందని, ఈ కేసులో ఆమె కీలక పాత్రధారి అండ్ సూత్రధారి అని ఈడీ, సీబీఐ అధికారులు చెబుతూ వస్తున్నారు. వారి వాదనతో కోర్టు ఏకీభవిస్తోంది. బెయిల్ నిరాకరిస్తోంది. దీంతో ఆమె జైల్లో మగ్గక తప్పడంలేదు.
ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మాత్రం 21 రోజుల బెయిల్ దొరికింది. ఆయన అదృష్టం ఏమిటంటే ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన మోడీ మీద రెచ్చిపోతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేయక్కరలేదని చెప్పిన కోర్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి మాత్రం వెళ్ళడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టింది.
ఈ సమయంలో ఆయన సీఎం ఆఫీసుకు వెళ్లడంకంటే ఎన్నికల ప్రచారం చేయడం ప్రధానం కాబట్టి ఆ పనిలో ఉన్నాడు. ఇదే అవకాశం కవితకు లేకుండా పోయింది. తాను పార్టీకి స్టార్ క్యాంపైనర్ను అని, ప్రచారం చేయాలని చెప్పినా కోర్టు పట్టించుకోలేదు. దీంతో ఆమె లేకుండానే ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. చివరకు ఎన్నికలే ముగిసిపోయాయి. ఎన్నికల ప్రచారం చేయాలన్న ఆమె ఆశ అడుగంటిపోయింది.
కోర్టు మరోసారి ఆమె జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. ఈడీ అధికారులు 8 వేల పేజీల చార్జిషీటు కూడా దాఖలు చేశారు. ఈ నెల 20 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుంది. చార్జిషీటులో కూడా కవితను ప్రధాన పాత్రధారిగా, సూత్రధారిగా అధికారులు పేర్కొన్నారు.
లిక్కర్ కుంభకోణంలో మనీష్ సిసోడియాకు కూడా ఇప్పటివరకు బెయిల్ దొరకలేదు. ఆయన బెయిల్ పిటిషన్లు కూడా ప్రతీసారీ తిరస్కరణకు గురవుతున్నాయి. కవితకూ అలాగే అవుతోంది. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వస్తాయి. అప్పటి వరకు కవిత జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే అదే జరుగుతుందేమో అనిపిస్తోంది.