దిగాలు పడుతున్న థియేటర్లు

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈసారి సంక్రాంతి తరువాత టిల్లు స్క్వేర్ నే పెద్ద హిట్. తప్పిస్తే సరైన సినిమా పడలేదు. ఏదో అలా అలా నడవడానికి పనికి వచ్చిన సినిమాలే తప్ప, ఊపు…

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈసారి సంక్రాంతి తరువాత టిల్లు స్క్వేర్ నే పెద్ద హిట్. తప్పిస్తే సరైన సినిమా పడలేదు. ఏదో అలా అలా నడవడానికి పనికి వచ్చిన సినిమాలే తప్ప, ఊపు తెచ్చిన రిలీజ్ లు లేవు. సమ్మర్ బాగుంటుంది అనుకుంటే ఎన్నికలు వచ్చి పడ్డాయి.

ఎన్నికలు రాకపోయినా పెద్దగా సినిమాలు వచ్చేదీ లేదు నిజానికి. పెద్ద హీరోల సినిమాలు అన్నీ సెట్ మీదే వున్నాయి. గేమ్ ఛేంజర్, దేవర, కల్కి, ఓజి, పుష్ప 2 ఇలా అన్నీ సెట్ మీదనే వున్నాయి. ఆ విధంగా సమ్మర్ ను థియేటర్లు కొల్పోయాయి.

ఎన్నికల తరువాత అయినా సరైన సినిమాలు వుంటాయి అనుకుంటే 17న రావాల్సిన సినిమా పదిహేను రోజులు వెనక్కు వెళ్లిపోయింది. దీంతో ఈ నెలలో దాదాపు పది రోజులకు పైగా సినిమాలే లేని పరిస్ధితి. ఇప్పటికే ఆంధ్రలో కొన్ని జిల్లాల్లో థియేటర్లు బంద్ చేయాలని ఎన్నికల ముందే అనుకున్నారు. డిజిటల్ చార్జీలను తగ్గించకపోతే థియేటర్లు రన్ చేయడం కష్టం అని యాజమాన్యాలు పదే పదే అంటున్నా పట్టించుకునేవారు లేరు.

ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని రోజుల పాటు థియేటర్ల మూత ను ప్రకటించారు. ఇలా థియేటర్లు మూతపెట్టడం అనివార్యమే కావచ్చు. కానీ జనాలు అలవాటు తప్పడానికి కూడా ఇది ఒక కారణం అవుతుంది.  ఇప్పటికే మంచి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప సినిమాల కోసం థియేటర్ కు రావడం లేదు. సామాన్యుడి జీవితం ఖర్చులతో భారం అవుతోంది.

ఆంధ్రలో కనుక తెలుగుదేశం ప్రభుత్వం వస్తే టికెట్ రేట్లు పెంచే అవకాశం వుంది. అప్పుడు హీరోలకు, నిర్మాతలకు ఎక్కువ లాభసాటిగా థియేటర్లకు ఓ మాదిరిగా వుంటుంది. కానీ జనం మాత్రం థియేటర్లకు మరింత దూరం అయ్యే ప్రమాదం వుంది.

ఎటు నుంచి ఎటు వచ్చినా థియేటర్లే సమస్య. రాను రాను ప్రేక్షకుడు అయితే మల్టీ ఫ్లెక్స్, లేదంటే ఓటిటి కి అలవాటు పడిపోతున్నాడు. ఇక ఏటేటా సింగిల్ స్క్రీన్ ల కౌంట్ తగ్గడం అన్నది అనవార్యం.