ఆయన ప్రస్తుతం జోస్యాలు చెబుతున్నారు. తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో 150 కి పైగా స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంటున్నారు. ఈ చిలక పలుకుతున్న జోస్యం నిజం అవుతుందా? లేదా? అనేది తర్వాతి సంగతి, అన్నిటికంటె ముందు ఆ చిలక కు అసలు శాసనసభాయోగం ఉన్నదా? లేదా? అనేది ప్రజల్లో చర్చగా ఉంది. ఆ చిలక మరెవ్వరో కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గి ప్రస్తుతానికి నరసాపురం ఎంపీగా ఉంటూ, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కావాలనే కోరికతో ఉండి నియోజకవర్గం నుంచి పోటీచేసిన రఘురామక్రిష్ణరాజు.
రచ్చబండ పేరుతో తెలుగుదేశం శ్రేణులను విపరీతంగా ఆకట్టుకోగల వీడియోలు చేయడం ఉపాధి మార్గంగా మార్చుకున్న ఈ యూట్యూబర్ నాయకుడు ఇప్పుడు సరికొత్త వీడియో విడుదల చేశారు. కూటమి గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఆయన గతంలో కూడా చాలా జోస్యాలు చెప్పారు.
మూడు పార్టీల మధ్య పొత్తులు కుదురుతాయని అన్నారు- కుదిరాయి! పొత్తుల్లో నరసాపురం ఎంపీ సీటు ఎవరికి దక్కినా సరే.. అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉండబోయేది తానే అని చెప్పారు- బిజెపి ఆయనను ఏమాత్రం పట్టించుకోలేదు! ఎంపీ టికెట్ కోసం నానా పైరవీలు చేసి వీలు పడక, తన అభిమానులంతా తనను శాసనసభాపతిగా చూడాలని అనుకుంటున్నారంటూ మరో జోస్యం వల్లించారు.
మొత్తానికి చంద్రబాబును మేనేజ్ చేసి ప్రకటించిన టికెట్ క్యాన్సిల్ చేయించి ఉండి స్థానాన్ని తనకు దక్కించుకున్నారు. కానీ ఎమ్మెల్యేగా నెగ్గాలంటే చంద్రబాబు అనుగ్రహం ఒక్కటీ సరిపోదు కదా.. ప్రజల అనుగ్రహం కూడా ఉండాలి ఆయనకు కరవైంది కూడా అదే.
ఉండి తెలుగుదేశం టికెట్ కోసం అక్కడి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ఎమ్మెల్యే రామరాజు గట్టిగానే పోటీపడ్డారు. సిటింగ్ ఎమ్మెల్యే రామరాజుకు చంద్రబాబు టికెట్ ప్రకటించారు. ఆయన ప్రచారం కూడా ముమ్మరం చేసేసిన తర్వాత.. రఘురామ గండం వచ్చింది. రామరాజును బుజ్జగించి.. చంద్రబాబు టికెట్ ను రఘురామపరం చేశారు. కానీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మెట్టు దిగలేదు. ఆయన ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ మీద బరిలోకి దిగారు. నిజానికి చాలా గట్టిపోటీనే ఇచ్చారు.
ఉండిలో ఆయనకే విజయావకాశాలు ఉన్నాయని కూడా స్థానికంగా వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో రఘురామ క్రిష్ణ రాజు కూటమికి 150 సీట్లు దక్కుతాయని చెబుతున్న జోస్యం సంగతి తరువాత.. ముందుగా తాను ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా? సభాపతిగా శాసనసభలో సింహాసనంపై కూర్చోవాలనుకున్న తన కోరిక తీర్చుకుంటారా? లేదా? వేచిచూడాలి.