జూన్ 27. ఇప్పటికి వున్న విడుదల డేట్.. కల్కి సినిమాకు సంబంధించి ఇదే లేటెస్ట్ అప్ డేట్. ప్రభాస్-నాగ్ అశ్విన్ ల కాంబినేషన్ లో తయారవుతున్న భారీ పాన్ ఇండియా సినిమా. ఇంకా చెప్పాలంటే దాన్ని పాన్ వరల్డ్ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మే 9న రావాల్సిన సినిమా వాయిదా పడింది. ఎన్నికలు ఒక కారణం. సిజి వర్క్ సంతృప్తికరంగా సిద్దం కాకపోవడం మరో కారణం. జూన్ 27 కు వాయిదా వేసారు. మంచి డేట్ అనే ఫ్యాన్స్ అంతా సంతృప్తిగా వున్నారు.
కానీ వస్తుందా? రాదా? అనుమానాలు మాత్రం ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపించడం ఆగలేదు. కచ్చితంగా వస్తుందా అంటే వస్తుందనే సమాధానం వినిపించడం లేదు. అలా అని వాయిదా పడుతుందనీ వినిపించడం లేదు. పబ్లిసిటీ అయితే స్టార్ట్ చేస్తారు అని టాక్ వుంది. కనీసం నెల రోజుల మేరకు ఇండియా వైడ్ గా ప్రచారం చేయాల్సి వుంటుంది. జూన్ 27 విడుదల అంటే ఈ నెల 20 నుంచి అయినా స్టార్ట్ కావాలి.
ఫస్ట్ సింగిల్ లో ప్రచారం స్టార్ట్ అవుతుందని వినిపిస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్ ప్రతి సినిమాకు ఇదే సమస్య. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏం జరుగుతుందో తెలియదు. అశ్వనీదత్ నిర్మాత- నాగ్ అశ్విన్ దర్శకుడు కనుక అలాంటి సమస్య వుండదు ఈసారి అనుకున్నారంతా. కానీ కల్కి కూడా అలాంటి సమస్యలతోనే సతమతం అవుతున్నట్లు కనిపిస్తోంది.
అసలు ప్రస్తుతం ప్రభాస్ ఎక్కడ వున్నారో తెలియదు. ఆయన ఓ వారం షూట్ చేస్తే పది నుంచి పదిహేను రోజులు గాయబ్ అయిపోతుంటారు. రాజా సాబ్ సినిమా అయితే మరీ చిత్రం అంత పెద్ద హీరో సినిమా షూట్ హీరో లేని సన్నివేశాల చిత్రీకరణ అంటూనే రోజులకు రోజులు షూట్ జరుగుతోంది. హీరో లేని సీన్లు అంత పెద్ద సినిమాలో ఎన్ని వుంటాయన్నది డవుటే. మరో పక్క ప్రభాస్ సినిమాలకు బాడీ డబుల్స్ ను ఎక్కువగా వాడేస్తున్నారన్న రూమర్ కూడా వుంది. బాడీ డబుల్స్, సిజిల మీద ఎక్కువ ఆధారపడిపోతున్నారనే గ్యాసిప్ లు ఇండస్ట్రీలో వున్నాయి.