ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ నాయకుల ఓవరాక్షన్ ఎక్కువైందనే విమర్శ. ఎన్డీఏకు ప్రజలు పట్టం కట్టినట్టు, వారికి ధన్యవాదాలు చెప్పడం ఎన్డీఏ నేతలకే చెల్లింది. పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రజాచైతన్యాన్ని తప్పక ప్రశంసించాలి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మాట్లాడే తీరు ఎలా వుందంటే… ఎన్డీఏకే పట్టం కట్టారని, ఇదంతా ప్రజాచైతన్యానికి నిదర్శనమని మాట్లాడుతున్నారు.
ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి వుందనే విషయాన్ని ఎన్డీఏ నేతలు మరిచిపోయారు. ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారనేంత బిల్డప్ ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీగా పోలింగ్ కావడం తమకు అనుకూలమని ఎన్డీఏ నేతలు అనుకోవడంలో తప్పు లేదు. కానీ కేవలం తమను గెలిపించేందుకే జనం అంతా పోలోమని పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లారని చెప్పుకోవడం కాస్త అతిశయోక్తిగా అనిపిస్తోందనే మాట వినిపిస్తోంది.
తమకున్న మీడియా బలంతో అదిగో, ఇదిగో ఎన్డీఏ వచ్చేసిందని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకం అంతా తమ వెంటే ఉన్నారని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తదితర నేతలు తమ మార్క్ కామెంట్స్‌తో ఎన్డీఏ నేతల ప్రచారాన్ని పీక్‌కు తీసుకెళ్తారు. ఎన్డీఏ అంచనా కూడా మరీ ఎక్కువగా వుందని అంటున్నారు. తమకు 125 నుంచి 140 సీట్లు వస్తాయని ఎన్డీఏ నేతల అంచనా. ఇదేం లెక్క అని అడిగితే… గత ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు.
గతంలో చంద్రబాబునాయుడు ఓడిపోవడానికి కారణాలను మాత్రం విస్మరిస్తున్నారు. మేనిఫెస్టోను విస్మరించి, తనకు కావాల్సింది మాత్రమే చంద్రబాబునాయుడు చేసుకెళ్లారు. అందుకే ఘోర పరాజం. కానీ జగన్ ఆ పని చేయలేదు. మేనిఫెస్టోను ప్రతి కార్యాలయంలో పెట్టి, మరీ పాలన సాగించారు. ఏది ఏమైనా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎన్డీఏ మాత్రం ఇక అధికారం తమ చేతల్లోకి వచ్చేసినట్టే ఫీల్ అవుతున్నారు. ఇక ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలి వుందని భావిస్తున్నారు. ఎవరి అంచనా నిజమవుతుందో తేలడానికి 20 రోజులే మిగిలి వుంది.