ఏపీలో అధికారంలో ఎవరుండాలో ఉభయగోదావరి జిల్లాలు నిర్ణయిస్తాయనే మాట ఈనాటిది కాదు. అందుకే ఆ రెండు జిల్లాల ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో 19, పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రెండు జిల్లాలను కలిపే రాజకీయంగా మాట్లాడుతుంటారు. తూ.గో, ప.గో జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే… ఈ రెండు జిల్లాల్లో అధిక సీట్లు సాధించడం వల్లే. అలాగే 2019లో జగన్ అధికారంలోకి రావడానికి ఈ రెండు జిల్లాలు అండగా నిలిచాయి.
2014లో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి ఐదు, ఇండిపెండెంట్‌గా గెలిచిన వర్మతో కలిపి 14 సీట్లు కూటమికి దక్కాయి. ఇదే పశ్చిమగోదావరి జిల్లాకు వెళితే… ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కని పరిస్థితిని 2014లో చూడొచ్చు.
2019లో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి 14, జనసేనకు 1, టీడీపీకి 4 సీట్లు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి 13, టీడీపీకి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. ఇదీ గత రెండు ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ, ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్ల లెక్కలు. 2019లో మూడు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. జనసేనకు ఒక్కటంటే ఒక్క సీటే దక్కింది. చివరికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి గెలవలేని పరిస్థితి.
ప్రస్తుతానికి వస్తే… రాజకీయ పార్టీలు ఆ రెండు జిల్లాలపై లెక్కలేస్తున్నాయి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19, ఏలూరులో 83.04, తూర్పుగోదావరి 79.31, పశ్చిమగోదావరి 81.12, కాకినాడ జిల్లాలో 76.37 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. ఈ జిల్లాల్లో ప్రధానంగా కాపులు, శెట్టిబలిజలు, దళితులు, క్రిస్టియన్లు, బీసీలు, రాజులు, ఒకట్రెండు నియోజకవర్గాల్లో రెడ్లు గెలుపోటములపై ప్రభావం చూపుతారు.
ఎన్డీఏ కూటమి ప్రధానంగా కాపులు, క్షత్రియులపై ఆశలు పెట్టుకుంది. బీసీల ఓట్లను వైసీపీ, కూటమి సమానంగా పంచుకుంటాయనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి జిల్లాల్లో పోలింగ్ తీరును గమనిస్తే… ఇటు వైసీపీ, అటు కూటమి కసిగా తమ ఓట్లను వేయించుకున్నట్టు అర్థమవుతోంది. కాపులు – శెట్టి బలిజలు, దళితుల మధ్య వైరం ఈనాటికి కాదని గ్రహించాల్సి వుంటుంది. శెట్టి బలిజలకు వైసీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది.
జనసేనాని పవన్‌కల్యాణ్ కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా తమకు ఇవ్వలేదనే ఆగ్రహం శెట్టిబలిజల్లో వుంది. దీంతో ఆ పార్టీలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన శెట్టిబలిజలంతా బయటికొచ్చారు. కాకినాడ మాజీ మేయర్ సరోజ తానొక శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచునని, రాజకీయంగా తీవ్ర అన్యాయం చేశారనే కామెంట్స్ వారిని తీవ్రంగా ఆలోచింప చేశాయి. దళితులు, క్రిస్టియన్లు కూటమికి వ్యతిరేకంగా పని చేశాయనే వార్తలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఈ రెండు జిల్లాల్లో వైసీపీ, కూటమికి ఎన్నెన్ని సీట్లు వస్తాయనే ఆరా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో వచ్చే సీట్ల ఆధారంగా అధికారం ఎవరిదనేది నిర్ణయమవుతుంది.