బహుశా.. ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడమే కావొచ్చు. అప్పటివరకు నమ్మకంగా ఉన్న వ్యక్తి వెన్నుపోటు పొడిచి పారిపోతాడు. మనకు సెట్ అవ్వడు అనుకున్నవాడు నమ్మకస్తుడిగా మారతాడు. ఎవర్ని నమ్మాలో, ఎవ్వర్ని నమ్మకూడదో తెలియని పరిస్థితి. చివరికి ప్రేమలు, పెళ్లిళ్లలో కూడా ఇదే అభద్రతా భావం.
పెళ్లయిన కొత్తలో విడిపోయిన జంటల్ని చూశాం. పెళ్లయిన ఏడాది, రెండేళ్లకు విడిపోయిన వాళ్లను చూశాం. కానీ పెళ్లయి ఏళ్లకుఏళ్లు కాపురాలు చేసిన తర్వాత విడిపోవడం ఈమధ్యనే చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సౌత్ సినిమాలో ఇప్పుడిది పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఆమధ్య నాగచైతన్య-సమంత విడిపోయారు. చక్కగా ప్రేమించుకున్నారు, అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. చచ్చేవరకు నీతోనే అనే అర్థం వచ్చేలా పోస్టులు కూడా పెట్టుకున్నారు. కట్ చేస్తే, పెళ్లయిన నాలుగేళ్లకే ముచ్చట తీరిపోయింది, అంతా అయిపోయింది. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ప్రేమ ప్రయాణం, వైవాహిక జీవితం కలిపి వీళ్లు కలిసున్నది పదేళ్లు. ఈ దశాబ్ద కాలంలో వీళ్లు ఒకర్నొకరు అర్థం చేసుకున్నది ఇదేనా.
ధనుష్-ఐశ్వర్యది మరీ ఘోరం. వీళ్లు ఏకంగా 18 ఏళ్లు కలిసి జీవించారు. కష్టసుఖాలన్నీ పంచుకున్నారు. ఒకరి వృత్తిని మరొకరు గౌరవించుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో విడిపోయారు. ఒకరి మొహం ఒకరు చూడ్డానికి కూడా ఇష్టపడలేనంతగా ద్వేషం పెంచుకున్నారు.
ఇక తాజాగా జీవీ ప్రకాష్ కుమార్, సైంధవి ది కూడా ఇదే వ్యధ. చిన్నప్పట్నుంచి ఒకరికొకరు పరిచయం. ఆ తర్వాత స్నేహం, ఆ తర్వాత ప్రేమ, ఇంకొన్నేళ్లకు పెళ్లి.. ఇలా దశాబ్దాల పాటు కలిసి ట్రావెల్ చేసిన జంట ఇది. పెళ్లయి కూడా పదేళ్లు దాటింది. అన్యోన్య దాంపత్యం వీళ్లదే అనుకున్న టైమ్ లో పొరపొచ్చాలు. తాము విడిపోయామంటూ ఎవరికి వారు స్టేట్ మెంట్స్ ఇచ్చుకున్నారు.
ఇంకాస్త వెనక్కు వెళ్తే ఇలాంటి ఉదంతాలు చాలానే కనిపిస్తాయి. పవన్ కల్యాణ్-రేణు దేశాయ్ చాలా ఏళ్లు కాపురం చేసి విడిపోయారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజది కూడా ఇదే పరిస్థితి. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడ్డం కోసం ఆమె ఎంత దూరం వెళ్లిందో అందరికీ తెలిసిందే. కానీ కళ్లముందే విడిపోయారు.
పదేళ్ల సమయం సరిపోవడం లేదా…?
పెళ్లంటే 2 కుటుంబాలు మాత్రమే కలవడం కాదు, 2 మనసులు కూడా కలవాలంటారు. అది నిజమే. కానీ అలా కలవడానికి ఎంత టైమ్ కావాలి. ఓ దశాబ్ద కాలం కూడా సరిపోవడం లేదా? ఈ విడాకుల కేసులు చూస్తుంటే అదే అనుమానం కలుగుతుంది. సామాజిక హోదా, డబ్బు, స్వేచ్ఛ, పాపులారిటీ వల్ల కొంతమందిలో సర్దుకుపోయే గుణం తగ్గిపోతోందా?
హాలీవుడ్ లో ఇలా పెళ్లి చేసుకొని అలా విడిపోతారు. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఇలాంటి వ్యవహారాలు చాలానే చూశాం. కానీ సౌత్ లో ఇలాంటివి తక్కువ. ఇప్పుడిప్పుడే ఎక్కువవుతున్నాయి. పదేళ్లు కాపురం చేసిన తర్వాత ఏదైనా సమస్య, అభిప్రాయ బేధం లేదా గొడవ తలెత్తినప్పుడు ఎందుకు కూర్చొని మాట్లాడుకోలేకపోతున్నారు? మొన్నటివరకు గర్వంగా చెప్పుకున్న ‘బెటర్ హాఫ్’, సడెన్ గా ఎందుకు భారంగా మారుతున్నారు? ఓ మనిషిని, మరీ ముఖ్యంగా భాగస్వామిని అర్థం చేసుకోవడానికి దశాబ్ద కాలం సరిపోదా..?