వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మొదటి నుంచి సమస్యాత్మక నియోజకవర్గం. ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ విలయతాండవం చేసింది. అదృష్టవశాత్తు ఇప్పుడు అలాంటి వాతావరణమే లేదు. అయితే ఎన్నికలొచ్చాయంటే చాలు… గొడవలు తప్పడం లేదు. తాజా ఎన్నికల్లో సైతం గొడవలు చోటు చేసుకున్నాయి.
జమ్మలమడుగులో ఎన్నికల తీరును పర్యవేక్షించడానికి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డిపై టీడీపీ, బీజేపీ శ్రేణులు దాడికి ప్రయత్నించాయి. దీంతో వైసీపీ అభ్యర్థి తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యారు. ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించారని తెలిసి, వైసీపీ శ్రేణులు ఆయనకు మద్దతుగా వేలాదిగా తరలి వెళ్లాయి. ప్రతిదాడి చేయడానికి ఏకంగా జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి స్వగ్రామం దేవగుడికి వెళ్తారనే ప్రచారం జరిగింది.
చివరికి వైసీపీ శ్రేణుల్ని ఎమ్మెల్యే, పోలీస్ అధికారులు సముదాయించారు. దీంతో గత రాత్రి గొడవ తప్పింది. ఇవాళ ఉదయం ఎమ్మెల్యే జమ్మలమడుగు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఆయన వెంట 400 వాహనాలు కదిలాయి. ఈ విషయం తెలిసి ముద్దనూరు వద్ద సుధీర్‌ను పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. తాము చెప్పింది వినాలని, అనవసరంగా గొడవలు వద్దంటూ సర్ది చెప్పారు. తాను గొడవలకు వెళ్లడం లేదని, తమ నాయకులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు మాత్రమే జమ్మలమడుగుకు వెళ్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు.
కానీ పోలీసులు వినిపించుకోలేదు. మరోవైపు ఎమ్మెల్యే తమపైకి వస్తున్నారనే సమాచారంతో దేవగుడిలో ఆదినారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి అప్రమత్తం అయ్యారు. తమ పార్టీల శ్రేణులతో వాళ్లిద్దరు కూడా జమ్మలమడుగులు బయల్దేరడానికి రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసి పోలీస్ అధికారులు దేవగుడికి వెళ్లి వాళ్లిద్దర్ని గృహ నిర్బంధం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవగుడి వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే సుధీర్‌ను కూడా ముద్దనూరు దాటి ముందుకు కదలనివ్వలేదు. ప్రస్తుతానికి జమ్మలమడుగు రాజకీయం అలా సాగుతోంది మరి!