మంత్రి ఆర్కే రోజా గెలుస్తారా? ఓడుతారా?… సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. నగరిలో 82 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో వైసీపీ అభ్యర్థి రోజా గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయనే చర్చకు తెరలేచింది. నగరిలో వైసీపీ తరపున రోజా, టీడీపీ నుంచి గాలి భానుప్రకాశ్ తలపడ్డారు. గత ఎన్నికల్లో భానుప్రకాశ్‌ను రోజా ఓడించారు. 2014లో గాలి ముద్దుకృష్ణమనాయుడిని రోజా ఓడించి మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
తన జీవితకాల కోరిక నెరవేరిందని రోజా చెప్పారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్‌లో ఆమెకు తప్పక చోటు వుంటుందని అంతా భావించారు. కానీ మంత్రి పదవి దక్కలేదు. రెండో దఫా మంత్రి వర్గ విస్తరణలో రోజాకు సీఎం జగన్ చోటు కల్పించారు. మంత్రిగా మరోసారి నగరి బరిలో రోజా దిగారు.
రోజాకు సొంత పార్టీ నుంచే ఇబ్బందులు తప్పలేదు. నిత్యం సొంత పార్టీ నాయకులతో పోరాటానికే రోజాకు సమయం సరిపోయింది. ఎన్నికల సమయానికి రోజా వ్యతిరేకులంతా తమ అసమ్మతి గళాన్ని మరింత పెంచారు. చివరికి పార్టీని వీడి, టీడీపీలో చేరి గాలి భానుప్రకాశ్ గెలుపు కోసం పని చేశారు.
మరోవైపు రోజా ప్రజల్నే నమ్ముకున్నారు. అయితే వైసీపీ అసమ్మతి నేతల వల్ల ఆమె ఓడిపోతారని విస్తృతంగా ప్రచారం జరుగుతూ వచ్చింది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న అశోక్‌రాజు లాంటి వారు వైసీపీలో చేరడం ఆమెకు కలిసొచ్చింది. అలాగే గాలి భానుప్రకాశ్ తల్లి, ఆయన తమ్ముడి సహకారం రోజాకు పరోక్షంగా వుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఓటర్లకు డబ్బు పంపకంలో గాలి భానుప్రకాశ్‌పై రోజా పైచేయి సాధించారు.
నగరి నియోజకవర్గంలో 82 శాతం పోలింగ్ నమోదు కావడం వైసీపీకి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల చైతన్యం వెల్లువెత్తడం, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎక్కువగా పాల్గొనడంతో నగరిలో సీన్ మారిందని అంటున్నారు. ఎన్నికలకు ముందు వరకూ నగరిలో రోజా ఓడిపోతుందన్న వాళ్లే, నేడు స్వల్ప మెజార్టీతో అయినా గట్టెక్కుతారని అంటున్నారు. రోజా గెలుపోటములపై పెద్ద ఎత్తున పందేలు జరుగుతున్నాయని సమాచారం.