ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చింతకాయల అయ్యన్నపాత్రుడు సహనం కోల్పోయారు. ఆయన ఎన్నికల అధికారుల మీద సిబ్బంది మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన నర్శీపట్నం టౌన్ లోని ఒక పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు.
అక్కడ పోలింగ్ జరుగుతున్న తీరుని పరిశీలించారు. కొన్ని అసౌకర్యాలు ఉన్నాయని స్థానికులు చెప్పడంతో అయ్యన్న ఉగ్ర రూపం దాల్చారు. ఆర్డీవోను పట్టుకుని లం అంటూ భాష వాడేశారు. అలాగే ఇతర అధికారుల మీద అసభ్య దూషణలు మొదలెట్టారు.
కలెక్టర్ కి మాట్లాడే తీరిక లేదా అంటూ ఫోన్ లో మరో అధికారి మీద మండిపడ్డారు. పనికిమాలిన సన్నాసులు అంటూ ఆయన రెచ్చిపోయారు. అక్కడ మహిళా ఓటర్లు ఉన్నారు అని కూడా చూసుకోకుండా అయ్యన్న బూతుల భాషతో ఆవేశాన్ని ప్రదర్శించడంతో అధికారులు అవాక్కు అయ్యారు.
ఆయన తీరు చూసిన వారు ఇదేమిటి పెద్దాయన ఇలా అంటూ ఆశ్చర్యపోయారు. దాదాపుగా డెబ్బై ఏళ్ళకు చేరువ అవుతున్న అయ్యన్నపాత్రుడు ఇంకా బీపీ పెంచుకుని అధికారులను దుర్భాషలు ఆడడం పట్ల విమర్శలు వస్తున్నాయి. పలు మార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన అయ్యన్న వయసు పెరుగుతున్నా ఇంకా తన హుందా తనాన్ని పెంచుకోకుండా ఈ రకంగా యాగీలు చేస్తూ అధికారుల మీద దుర్భాషలు ఆడడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయ్యన్నా ఇదేమి ధోరణి అంటున్నారు. పెద్దాయన ఇక మారరా అని కూడా అంటున్నారు.