ఎట్టకేలకు సెట్స్ పైకి వస్తున్నాడు పూరి జగన్నాధ్. ఇంకా చెప్పాలంటే, 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పూరి నుంచి మరో సినిమా వస్తోంది. రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ సినిమా ఈరోజు అధికారికంగా లాంచ్ అయింది.
గతేడాది ఆగస్ట్ లో లైగర్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజుకే డిజాస్టర్ అయింది. అప్పట్నుంచి సెట్స్ కు దూరమైన పూరి జగన్నాధ్ మళ్లీ ఇన్నాళ్లకు, రామ్ తో కలిసి సెట్స్ పైకి రాబోతున్నాడు. బుధవారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.
గతంలో రామ్-పూరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. అప్పుడే ఆ సినిమాకు ఫ్రాంచైజీ కూడా ప్రకటించారు. తాజాగా రామ్ పుట్టినరోజు సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. ఇప్పుడీ సినిమా అధికారికంగా మొదలైంది.
హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఫస్ట్ షాట్ కు నిర్మాత చార్మి క్లాప్ కొట్టగా, పూరి డైరక్ట్ చేశాడు. ఫస్ట్ షాట్ లో 'ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్' అనే డైలాగ్ చెప్పాడు రామ్.
స్కంద సినిమాను ఇలా పూర్తిచేసి, అలా పూరి జగన్నాధ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తున్నాడు రామ్. వచ్చే ఏడాది మార్చి 8న మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది.