పవన్ కళ్యాణ్‌తో సినిమా చెయ్యాలంటే త్రివిక్రం ని సంప్రదించాలట. ప్రాజెక్ట్ ఆయన ఓకే చేస్తేనే ముందుకెళ్తుందట. ఈయన ఆయనకి మేనేజరా? మెంటరా? కేర్ టేకరా? డెజిగ్నేషన్ అధికారికంగా లేకపోయినా వీటిల్లో ఏదో ఒకటి అనుకోవచ్చు. ఒక స్టార్ హీరో కెరీర్ చేతిలో ఉండడం మామూలు విషయంకాదు. అసలది త్రివిక్రంకి ఎలా సాధ్యపడి ఉండొచ్చు?
త్రివిక్రమేమీ సామాన్యుడు కాదు. అద్భుతమైన సినిమాలు చేసిన కమెర్షియల్ డైరెక్టర్. అయితే అదొక్కటే క్వాలిఫికేషనా అనుకుంటే కాదు. తనలాంటి సక్సెస్సులున్న దర్శకులు ఇంకొంతమంది లేకపోలేదు ఇండష్ట్రీలో. మరి ఏమయ్యుండొచ్చు? త్రివిక్రంకి మాత్రమే ఈ అవకాశం ఎలా వచ్చిండొచ్చు? ఏది కలిసొచ్చి ఉండొచ్చు?
ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆలోచిస్తూ నాలో నేను వేసుకుంటున్న కొన్ని లెక్కలు ఈ వ్యాసం.
నా దృష్టిలో పవన్ కళ్యాణ్ ముందు తెలివితేటలు ప్రదర్శించే వాడు అమాయకుడు. తెలివున్నా అతని ముందు అమయాకత్వం నటించేవాడు మేధావి. ఇక్కడ మొదటి రకంలోకి వచ్చేవాళ్లు శరత్ మరార్, రాజురవితేజలాంటి వాళ్లు. రెండో కోవకి చెందిన వాడు మాటలమాంత్రికుడు త్రివిక్రం.
సినిమా సంభాషణల్లో ప్రదర్శించే చతురత వల్ల ఈయనని “మాటల మాంత్రికుడు” ఏ జర్నలిష్టో ఎప్పుడో రాయడం వల్ల అదలా స్థిరపడింది. నిజానికి సినిమా మాటల్లోనే కాదు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరిని బుట్టలో వేసుకోవడానికి ఏ డైలాగులు పలకాలో తెలిసిన అసలుసిసలు మాంత్రికుడు త్రివిక్రం.
పవన్ కళ్యాణ్ కి కొత్త విషయాలు తెలుసుకోవాలని కుతూహలం ఉండొచ్చు. తానొక మేధావిలాగ గుర్తింపు తెచ్చుకోవాలని కోరికుండొచ్చు. ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా లోతుగా విశ్లేషించగల తెలివి ఉన్న వ్యక్తిగా ప్రపంచం తనని గుర్తించాలనే ఆశ ఉండొచ్చు.
కానీ ఆ కోరిక తీరాలంటే నిజంగా విషయం, మేథస్సు, తెలివి ఉండాలా? అవసరం లేదు. అవి లేకపోయినా తనలో అవన్నీ ఉన్నాయని తనని భ్రమింపజేసే వ్యక్తి ఉంటే చాలు. అది తెలిసి పవన్ కోరికని సైకాలజికల్ గా తీర్చిన, తీరుస్తున్న వ్యక్తి త్రివిక్రం అని నా అభిప్రాయం.
“రాజుగారు- కొత్త బట్టలు” అని ఒక కథ… చాలామందికి తెలిసే ఉంటుంది. కంటికి కనిపించని బట్టలని చెప్పి రాజుగారికి బట్టలు తొడిగినట్టుగా నటించి కొత్త బట్టల్లో అద్భుతంగా ఉన్నారని పొగుడుతారు ఇద్దరు వ్యక్తులు. వాళ్ల మాయమాటలకి నమ్మి ఒంటి మీద బట్టలున్నాయనే భ్రమతో మొండిమొలతో బయట తిరుగుతాడు రాజు.
సరిగ్గా అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ ది.
పవన్ ఏం చెప్పినా, “స్వామీ! మీరు దేన్నైనా అద్భుతంగా విశ్లేషిస్తారు. మీకున్నంత క్లారిటీ నాక్కూడా ఉండదు” అని త్రివిక్రం అనొచ్చు.
త్రివిక్రం అంతటి వాడే తన విశ్లేషణాశక్తిని మెచ్చుకుంటే అది నిజమేననుకుని అరకొర జ్ఞానంతో స్పీచులు దంచొచ్చు పవన్.
ఏ వైసీపీవాళ్లో అతని స్పీచులు విని గాలి తీస్తుంటే, “ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి స్వామి. వాళ్లు మీ ప్రసంగాల ధాటికి బెంబేలెత్తున్నారు. లేకపోతే మీ గాలి ఎందుకు తీయాలనుకుంటారు చెప్పండి!” అని చెప్పి మరింత భ్రమలోకి నెట్టొచ్చు.
అలా చెప్పగా చెప్పగా పవన్ తెలియకుండానే త్రివిక్రంకి బానిసైపోయి ఉండొచ్చు. అప్పుడే త్రివిక్రం బానిసని రాజులా భ్రమింపజేసే మాటలు మాట్లాడుతూ తన కార్యాల్ని చక్కబెట్టుకోవాలి. అలా పవర్ స్టార్లోని పవర్ ని లాక్కుని తన దగ్గర పెట్టుకుని కేవలం ప్రాజెక్టుల సెట్టింగ్, కాస్తంత పర్యవేక్షణ చేసి కోట్లల్లో సంపాదిస్తున్నాడు త్రివిక్రం. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలంటే వరుసగా నాలుగైదు పవన్ సినిమాలు సెట్ చేసి పెడితే చాలు.
ఇదిలా ఉంటే “అలా చేస్తే తప్పు, “”మీ ఆలోచన సరి కాదు”, “మీమంచి కొసం నా మాట వినండి” లాంటి మాటలతో పవన్ కి చేరువగా చాలా కాలం ఉన్న శరత్ మరార్ లాంటి నిర్మాత, రాజు రవితేజ లాంటి పొలిటికల్ రైట్ హ్యాండ్ దూరమయ్యారు.
పవన్ ఒక బంగారు బాతు. దానిచేత జాగ్రత్తగా గుడ్డు పెట్టించుకుని అమ్ముకుంటున్నాడు బతకనేర్చిన మాటల మాంత్రికుడు. కానీ ఆ బాతుని తమ తెలివితో చిరాకు పెట్టించి దూరమయ్యారు కొందరు.
పవన్ కి తెలివైనవాళ్లంటే భయం, ఆత్మన్యూనతా భావం. అందుకే అది ఉన్నా లేనట్టే ఉండాలి. దానికి చాలా తెలివి కావాలి. అది త్రివిక్రం సొంతం.
త్రివిక్రం మాదిరిగా మరొక అత్యంత తెలివైన వ్యక్తి ఉన్నాడు. అతనే నాదెండ్ల మనోహర్. పవన్ తన సినీ కెరీర్ ని త్రివిక్రం చేతిలో పెడితే, రాజకీయ జీవితాన్ని నాదెండ్లకి అప్పజెప్పాడు. ఆయన కూడా సైలెంటుగా చంద్రబాబుకి-పవన్ కి మధ్య వారధిగా ఉండి పని కానిస్తున్నాడు.
ఇది ఒకవ్యక్తిత్వ వికాస పాఠం. ఒక వ్యక్తిలో తెలివి లేకపోయినా కొలవలేనంత డబ్బో, మాస్ ఫాలోయింగో మరొకటో ఉండొచ్చు. అటువంటి వ్యక్తుల ఇగోని దువ్వితే చాలు దాసోహమవుతారు… తమకి తెలియకుండానే ఆడిస్తున్న వాళ్ల జీవితాలని పెంచి పోషిస్తారు. కనుక “మాటే మంత్రము మనసే బంధము” అనే విషయాన్ని మరిచిపోకుండా గెలుచుకోవాల్సిన వాళ్ల మనసుల్ని గెలుచుకుని జీవితానికి పనికొచ్చే బంధాన్ని మాటలమంత్రం ద్వారా వేసుకోవచ్చు.
– హరగోపాల్ సూరపనేని