వైసీపీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారనే విషయమై రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ అయిన మిథున్‌రెడ్డి ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వారాహి యాత్రలో పవన్ అవాకులు చెవాకులు పేలడంపై మిథున్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. వైసీపీ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు.
పీకే టీమ్‌తో పాటు వివిధ సర్వే సంస్థలతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల గ్రాఫ్‌పై నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా కొంత మందిని పిలిపించుకుని పంథా మార్చుకోవాలని, లేదంటూ టికెట్ ఇవ్వనని ఏ మాత్రం మొహమాటం లేకుండా జగన్ చెబుతున్నారు. దీంతో కొందరు ఎమ్మెల్యేలు బతుకు జీవుడా అని దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో ఎలాంటి వారికి టికెట్లు దక్కుతాయో మిథున్‌రెడ్డి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బాగా పని చేసిన వారికి టికెట్లు ఇస్తామని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేలను మార్చే అవకాశం వుండదని ఆయన చెప్పడం చర్చనీయాంశ మైంది. ఎన్నికలకు కనీసం మూడు, నాలుగు నెలల ముందు అభ్యర్థులను ప్రకటించేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.
టికెట్లు దక్కనివారి నుంచి నష్టం జరగకుండా జగన్ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయమై సంబంధిత నాయకులకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న చోట మాత్రమే ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ అభ్యర్థుల ప్రకటన మాత్రం ఈ ఏడాది చివరికల్లా వస్తుందని మిథున్‌రెడ్డి ప్రకటనతో నిర్ధారణ అయ్యింది.