తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఓ మాజీ బ్యూరోక్రాట్ ను రంగంలోకి దించబోతున్నారా? స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీగా సుదీర్ఘకాలం సేవలందించిన ఐపీఎస్ అధికారి, మాజీ ఎస్పీ చిన్నస్వామిని తెలుగుదేశం అభ్యర్థిగా నిలబెట్టడానికి మంతనాలు సాగుతున్నాయా? అనే గుసగుసలు పార్టీ వర్గాలలో వినిపిస్తున్నాయి.
తిరుపతి పార్లమెంటు స్థానానికి గతంలో ఉప ఎన్నిక జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పనబాక లక్ష్మి, ఈసారి బరిలో ఉండకపోవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరి వ్యక్తుల్లో ఒకరైన గురుమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి నిజానికి తిరుపతి నుంచి పోటీ చేయడానికి గట్టి అభ్యర్థి అందుబాటులో లేరు. గతంలో చిత్తూరు ఎంపి గాను, తిరుపతి ఎంపీగా కూడా పార్టీ తరఫున గెలిచిన ఎన్ శివప్రసాద్ మరణించడంతో తెలుగుదేశం పార్టీకి ఆ లోటు ఏర్పడింది. సరైన అభ్యర్థి కోసం దేవులాటలో భాగంగా వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర దళిత నాయకులపై కన్నేసినట్లుగా అర్థమవుతోంది.
ఎస్పీజీ ఎస్పీగా పని చేసిన చిన్నస్వామి గతంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎనిమిది మంది ప్రధాన మంత్రుల వద్ద రక్షణ అధికారిగా పనిచేసిన అనుభవం చిన్నస్వామికి ఉంది. అంత సుదీర్ఘకాలం చేసిన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి మరీ ఆయన ఏ ఆశలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారో కానీ, పదవులేమీ దక్కలేదు.
జగన్ మాటలను నమ్మి ఆ పార్టీలోకి వచ్చానని, అయితే జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక చర్యలు తనకు అసంతృప్తి కలిగించాయని ఈ చిన్నస్వామి ఇప్పుడు సెలవు ఇస్తున్నారు. ప్రధానంగా జగన్ పరిపాలనలో మాదిగలకు చాలా ద్రోహం జరుగుతుంది ఆయన ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దళితుల అభివృద్ధిని కాంక్షించే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చి ఆయన సమక్షంలో తెలుగుదేశంలో చేరినట్లుగా వెల్లడించారు. మాదిగలకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ఏం ఒరగపెట్టారో బహుశా ఈ చిన్నస్వామి ఒక్కరికే తెలియాలి.
తాను పదవులు ఆశించి తెలుగుదేశంలో చేరలేదని కానీ చంద్రబాబు నాయుడు ఏ బాధ్యతలు అప్పగించినా చక్కగా నిర్వర్తిస్తానని సన్నాయి నొక్కులు నొక్కుతున్న చిన్నస్వామి తిరుపతి ఎంపీ టికెట్ మీద కన్నేసే వచ్చారనేది స్పష్టం. తెలుగుదేశానికి కూడా అంతకుమించి వేరే గతి లేదు.
ఇలాంటి నేపథ్యంలో ఇద్దరు గతిలేని వాళ్ళు ఒకరినొకరు ఆశ్రయించినట్లుగా ఈ చిన్నస్వామి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.