హీరోయిన్ కాజల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నిన్న తమకు మగ బిడ్డ జన్మించినట్టు కాజల్ భర్త గౌతమ్ కిచ్లు ప్రకటించాడు. ఈరోజు ఆ బాబుకు పేరు పెట్టారు. కాజల్ కొడుకు పేరు నీల్. ఈ పదానికి ఛాంపియన్ అని అర్థం.
“ఏప్రిల్ 19, 2022న నీల్ కిచ్లు పుట్టాడనే విషయాన్ని చెప్పడానికి మేం చాలా సంతోషిస్తున్నాం. మా మనసులు ఉప్పొంగుతున్నాయి. చాలా సంతోషంగా ఉన్నాం. మాకు ప్రేమను అందించి, ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు” అంటూ నీల్ పేరును బయటపెట్టాడు గౌతమ్ కిచ్లు.
2020 అక్టోబర్ లో కాజల్-గౌతమ్ పెళ్లి చేసుకున్నారు. కరోనా/లాక్ డౌన్ కారణంగా పెళ్లికి ఎవ్వర్నీ ఆహ్వానించలేదు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో గుంభనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది కాజల్. ఆ తర్వాత ప్రెగ్నెంట్ లుక్ తో ఫొటోల్ని కూడా పోస్ట్ చేయడం ప్రారంభించింది.
ఓవైపు గర్భంతో ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో పలు ఉత్పత్తులకు ప్రచారం చేసింది కాజల్. అలా సినిమాలు ఆగినా, సంపాదనకు ఢోకా లేకుండా చూసుకుంది. ఇప్పుడు బిడ్డకు జన్మనివ్వడంతో, మరికొన్ని నెలల పాటు బాబుతోనే ఉండబోతోంది. ఆమె నటించిన ఆచార్య సినిమా ఈనెల 29న థియేటర్లలోకి రాబోతోంది.