టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెత్త వాగుడుకు హద్దూఅదుపూ లేకుండా పోతోంది. పేరులో తప్ప, మాటల్లో బుద్ధి కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుద్దా వెంకన్న చెత్తవాగుడు పతాకస్థాయికి చేరింది. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిపోవడంతో, ఎలాగైనా మీడియాలో తన గురించి చర్చ జరగాలన్న చిల్ల ఆలోచనలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని బుద్దా వెంకన్న విజయవంతంగా వాడుకుంటున్నారు.
ఇవాళ చంద్రబాబు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అధినేతపై అభిమానం చాటుకోడానికి అభ్యంతరకర వ్యాఖ్యలను బుద్దా వెంకన్న ప్రయోగించడం విశేషం. చంద్రబాబుపై చెత్త వాగుడు వాగితే చంపడానికైనా, చావడానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఇందుకోసం వంద మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబును తిడితే, టీడీపీ ఆఫీస్‌పై దాడి చేస్తే పదవులు వస్తాయనుకుంటున్నారని బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేయడానికి వెళ్లినందుకే, సీనియర్లను కాదని జోగి రమేష్‌కి మంత్రి పదవి వచ్చిందన్నారు. బుద్దా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు.
కేవలం సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ పబ్బం గడుపుకోవడం తప్ప, టీడీపీ బలోపేతానికి చేసేందేమీ లేదనే విమర్శలున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలే పార్టీ సూసైడ్ చేసుకునేందుకు కారణమవుతాయని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
ఏ అంశాల్ని వ్యతిరేకిస్తున్నామో, రకరకాల సాకులతో అవే మాటల్ని మనం మాట్లాడ్డంలో ఔచిత్యం ఏముందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తుండడం గమనార్హం.