తాను కూత కూయనిదే తెల్లవారదని వెనుకటికి ఓ పుంజుకోడి అనుకున్నదట. సరిగ్గా ఈ మాదిరిగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబునాయుడు రాజకీయాలతో సవాలక్ష విభేదాలున్న వారు కూడా ఆయన ఆయురారోగ్యాలతో శేష జీవితం గడపాలని కోరుకుంటారు. ఇందులో రెండో మాటకు తావు లేదు. ఇదే సందర్భంలో వయసు, అనుభవం పెరుగుతున్నా ఆయనలో అతిశయం మాత్రం కొనసాగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాను తప్ప లోకాన్ని ఉద్ధరించే వాళ్లే లేరని ఆయన బలమైన అభిప్రాయం.
ఇవాళ ఆయన మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సందర్శించుకున్నారు. ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు తనను ఆశీర్వదిస్తున్నారని, జన్మదినం సందర్భంగా వేడుకలు చేసుకుంటూ శుభాకాంక్షలు చెబుతున్నారని చెప్పుకొచ్చారు.
తెలుగు జాతికి పూర్వ వైభవం తేవడం అంటే ఏంటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశానికి పూర్వ వైభవం తీసుకొస్తానంటే అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా ఏకంగా తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పడంలో అర్థం, పరమార్థం ఏంటనే నిలదీతలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగు జాతి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వస్తాయి. మరి రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి మళ్లీ వస్తామని పరోక్షంగా ఆయన చెప్పదలుచుకున్నారా? తెలంగాణలో అది సాధ్యమా? తనను తాను ఎక్కువ ఊహించుకుని గొప్పలు చెప్పుకోవడం ఇంకా చంద్రబాబులో పోలేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇప్పుడాయన తక్షణ కర్తవ్యం తెలుగుదేశం పార్టీని ఉద్ధరించడం. ఎందుకంటే రానున్న ఎన్నికలు ఆ పార్టీకి చావుబతుకుల సమస్య. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ మట్టి కొట్టుకుపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలు సజీవంగా ఉన్నాయి. కావున తెలుగు జాతి లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడకుండా, టీడీపీ భవిష్యత్‌పై దృష్టి సారిస్తే చంద్రబాబుకే మంచిది. తన పూర్వవైభవం సంగతిని తెలుగు జాతి చూసుకుంటుంది.