పాన్ ఇండియా అంటే ఏంటో నాకు తెలీదు – నాని

ప్రతి సినిమాకు పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తగిలించడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. తెరవెనక డబ్బింగ్ చెప్పించడం, మీడియా ముందుకొచ్చినప్పుడు మాత్రం తమది పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోవడం కామన్ అయిపోయింది.…

ప్రతి సినిమాకు పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తగిలించడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. తెరవెనక డబ్బింగ్ చెప్పించడం, మీడియా ముందుకొచ్చినప్పుడు మాత్రం తమది పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోవడం కామన్ అయిపోయింది. ఈ మొత్తం వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించాడు నాని. పాన్ ఇండియా అంటే ఏంటో తనకు తెలియదన్న ఈ హీరో.. తన దృష్టిలో పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో చెప్పుకొచ్చాడు.

“దేశంలో ఎక్కడెక్కడో ఉండే అన్ని భాషల జనాలు మన తెలుగు సినిమా చూసి అది బాగుందని చెబితే దాన్ని పాన్ ఇండియా సినిమా కింద లెక్కగట్టాలి. ఓ సినిమా బాగుందని ఎక్కడో ఏదో భాషలో ఉన్న ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలి. ఆ సినిమాను ఓటీటీలో వెదికి చూడాలి. లేదా థియేటర్లలో వెదుక్కొని చూడాలి. అలా మన సినిమా చూస్తే, అది నా దృష్టిలో అసలైన పాన్ ఇండియా సినిమా.”

ఇలా పాన్ ఇండియా సినిమాకు తనదైన అర్థం చెప్పాడు నాని. ఓ సినిమాకు అంత అప్లాజ్ రావాలంటే.. అది ఇండియాలోని ప్రతి కార్నర్ లో రిలీజ్ అవ్వాలంటున్నాడు. ఇలా చేయకుండా.. ప్రతి సినిమాకు పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ పెట్టడం వల్ల లాభం లేదని అంటున్నాడు.

అంటే సుందరానికి సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను కన్నడలో డబ్ చేయడం లేదు, కన్నడ ప్రేక్షకులు తెలుగులోనే సినిమా చూడ్డానికి ఇష్టపడతారని, అందుకే డబ్బింగ్ చేయలేదని చెప్పిన నాని.. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఏ సినిమాకు కనెక్ట్ అవుతారో అదే పాన్ ఇండియా సినిమా అంటున్నాడు. 

ఇక తన విషయానికొస్తే.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న దసరా సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. 

Click Here For Photo Gallery