టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం పుట్టిన రోజు. అధినేత పుట్టిన రోజు పురస్కరించుకుని ఆళ్లగడ్డ క్రీడా పోటీలను నిర్వహించాలని ఆమె అనుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
క్రీడా పోటీలు చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు రావాలని కోరారు. చంద్రబాబు జన్మదినానికి బదులు జయంతి అని పొరపాటుగా మాట్లాడ్డమే ఆమె తప్పిదమైంది. అసలే సోషల్ మీడియా యుగం. ప్రత్యర్థులు ఎలాంటి తప్పులు చేస్తారా, సోషల్ మీడియా వేదికగా ఎలా ఎండగడదామా అని ఎదురు చూస్తున్న రాజకీయ పార్టీల యాక్టివిస్టులకు అఖిలప్రియ చిక్కారు.
చనిపోయిన వారి జన్మదినాన్ని జరుపుకోవడాన్ని జయంతి అని పిలుచుకుంటారు. అఖిలప్రియ తప్పిదాన్ని ఎదురుగా ఉన్న మీడియా ప్రతినిధులు సరిచేశారు. వెంటనే చంద్రబాబు జన్మదినాన్ని అని అఖిలప్రియ తన తప్పును సరిదిద్దుకున్నారు. కానీ అధినాయకుడి పుట్టిన రోజుకు ఆమె చేపట్టిన కార్యక్రమాలు పక్కకు వెళ్లాయి.
జన్మదినాన్ని జయంతిగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జయంతికి, జన్మదినానికి తేడా తెలియదా? అని నెటిజన్లు వెటకరిస్తున్నారు. అలాగే బతికున్న మనిషిని ఏం చేయాలనుకుంటున్నావమ్మా అని కొందరు నెటిజన్లు సెటైర్స్ విసరడాన్ని గమనించొచ్చు.
ఏది ఏమైనా ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాల్సిన ఆవశ్యకతను అఖిలప్రియకు నెటిజన్లు తెలియచెప్పారు.