ఇదేం ధ‌ర్మం ధ‌ర్మాన‌?

నిజంగా అన్యాయంపై కోపం ఉంటే, దానిపై ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించాలి. చేత‌నైతే న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నించాలి. ఒక్కొక్క‌రికి ఒక్కో నీతి వుండ‌కూడ‌దు. అలా వుందంటే అది నీతి అనిపించుకోదు. అధికార ద‌ర్పం అవుతుంది. రెవెన్యూశాఖ మంత్రి…

నిజంగా అన్యాయంపై కోపం ఉంటే, దానిపై ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించాలి. చేత‌నైతే న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నించాలి. ఒక్కొక్క‌రికి ఒక్కో నీతి వుండ‌కూడ‌దు. అలా వుందంటే అది నీతి అనిపించుకోదు. అధికార ద‌ర్పం అవుతుంది. రెవెన్యూశాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు రెవెన్యూశాఖ‌లో అవినీతిపై ధ‌ర్మాగ్ర‌హాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. 

దేశ వ్యాప్తంగా రెవెన్యూ, పోలీస్ త‌దిత‌ర శాఖ‌లు అవినీతి నిల‌యాలుగా మారాయి. రెవెన్యూశాఖ అవినీతిపై ఇటీవ‌ల ధ‌ర్మాన ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌పై రెవెన్యూశాఖ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. అయితే రాజ‌కీయ నాయ‌కుల అవినీతి ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మ‌ర్యాద పాటించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 

ప్ర‌జాప్ర‌తినిధులు చ‌ట్ట వ్య‌తిరేకంగా చేయ‌మ‌ని అడిగితే అవ‌మానించొద్ద‌ని ధ‌ర్మాన రెవెన్యూ అధికారుల‌కు సూచించారు. సాధ్యం కాని విష‌యాల‌ను వారికి అర్థ‌మ‌య్యేలా వివ‌రించాల‌ని ధ‌ర్మాన ధ‌ర్మోప‌దేశం చేయ‌డం విచిత్రంగా ఉంది. ఇదే పెద్ద మ‌నిషి రెవెన్యూ అధికారుల ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి… రికార్డులు తారుమారు చేసి ఒక‌రి ఆస్తిని వేరొక‌రి పేరిట మార్చే అధికారం ఎవ‌రిచ్చార‌ని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. అలా చేయ‌డం త‌ప్పు కాదా? అని ధ‌ర్మాన ప్రశ్నిస్తున్నారు.  

అస‌లు రెవెన్యూ, పోలీసు అవినీతికి మూలకార‌ణం రాజ‌కీయ నాయ‌కులే. రెవెన్యూ అధికారులు త‌మ సొంతానికి రికార్డులు మార్చ‌ర‌నే విష‌యం సంబంధిత మంత్రికి తెలియ‌దా? సామాన్యులు రెవెన్యూ, పోలీస్ కార్యాల‌యాల‌కు వెళ్లి ప‌ని చేసుకునే ప‌రిస్థితి ఎక్క‌డైనా ఉందా? ఒక‌వేళ ఆ ప‌రిస్థితి ఉందంటే … అంత‌కంటే బూతు ఏమైనా ఉందా? అన్ని వ్య‌వ‌స్థ‌లు అవినీతిమ‌యం కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం రాజ‌కీయ వ్య‌వ‌స్థే.

అధికారం చేతిలో ఉన్న వాళ్లు త‌మ ఇష్టానుసారం రెవెన్యూ శాఖ‌ను అడ్డు పెట్టుకుని భూముల‌ను సొంతం చేసుకుంటున్నారు. ఎందుకంటే భూమికి మించిన ఆదాయ వ‌న‌రు మ‌రేదీ లేదు. రెవెన్యూశాఖ‌ను అవినీతిమ‌యం చేసే ప్ర‌జాప్ర‌తినిధుల‌తో మాత్రం మ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ధ‌ర్మాన కోర‌డం న్యాయ‌మా? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. 

వ్య‌వ‌స్థ‌ల్ని నాశ‌నం చేసే వాళ్ల‌కు మ‌ర్యాద ఇవ్వ‌డం ఏంట‌నేది సామాన్యుల ప్ర‌శ్న‌. రాజ‌కీయ నాయ‌కుల మెప్పు కోసం త‌మ‌ను బ‌ద్నాం చేయ‌డం ఏంట‌నే రెవెన్యూ అధికారుల‌ ప్ర‌శ్న‌కు ధ‌ర్మాన స‌మాధానం ఏంటి?