ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలు టీడీపీ అధినేత చంద్రబాబును భయపెడుతోంది. దీంతో ఎలాగైనా సంక్షేమ పథకాల అమలును అడ్డుకుంటే తప్ప టీడీపీకి మనుగడ వుండదనే ఆలోచన చంద్రబాబులో ఉంది. సంక్షేమ పథకాల వ్యతిరేకిగా ముద్ర పడితే రాజకీయంగా ఇబ్బంది వస్తుందనే భయం ఆయన్ని వెంటాడుతోంది. దీంతో సంక్షేమ పథకాలను అడ్డుకునే బాధ్యతను కొందరు మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో పాటు ఎల్లో మీడియాకు అప్పగించారు.
తాను మాత్రం సంక్షేమ పథకాల మద్దతుదారుడిగా గుర్తింపు పొందేందుకు చంద్రబాబు ఉబలాటపడుతున్నారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడానికి సంక్షేమ పథకాలు కారణం కానే కాదని చంద్రబాబు అంటుండం విశేషం. ఎన్టీఆర్ హయాం నుంచి సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం సీఎం జగన్ లూటీ వల్లే రాష్ట్రం కుప్పకూలిపోతోందని చంద్రబాబు విమర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
చంద్రబాబు వ్యూహాలకు కాలం చెల్లింది. ఎన్టీఆర్ హయాం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని చంద్రబాబు గుర్తించినట్టు లేరు. చంద్రబాబు ప్రతి ఆలోచనను పసిగట్టే చైతన్యస్థాయికి సమాజం పురోగమించింది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలుకు మోకాలు అడ్డుతున్న విషయాన్ని ప్రజానీకం గ్రహిస్తోంది. తమకు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు వేర్వేరు శక్తుల్ని రంగంలోకి చంద్రబాబు దింపారని ఒక వర్గం ప్రజానీకం ఆగ్రహం వుంది.
సంక్షేమ పథకాలకు రాష్ట్ర ఆదాయాన్ని పంచడం వల్ల ఏపీ మరో శ్రీలంకలా మారుతుందనే భయాన్ని ఓ పథకం ప్రకారం టీడీపీ తన ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం సాగిస్తోంది. అభివృద్ధి పనులను కూడా చేయాలని డిమాండ్ చేయడంలో అర్థం వుంది.
కానీ సంక్షేమ పథకాలనే మొత్తం ఎత్తివేయాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేశ్‌లాంటి వాళ్లతో చెప్పించడం దేనికి నిదర్శనం? ఇదే డిమాండ్ చంద్రబాబు చేస్తే బాగుంటుంది కదా? ఆ పని ఆయన చేయకుండా, వేరే ముసుగు వ్యక్తులతో చేయిస్తున్నారంటేనే చంద్రబాబు కుటిల రాజనీతిని అర్థం చేసుకోవచ్చనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.