మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎప్పటికీ మారరా? అంటే… మారరనే సమాధానం వస్తోంది. నేల విడిచి ఆయన రాజకీయ సాము చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ టీడీపీని బలోపేతం చేసే చర్యల గురించి ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. అధికార పార్టీ బలహీనతపైన్నే ఆయన ఆశలు పెట్టుకున్నారు. 2019లో టీడీపీ ఘోర పరాజయం గురించి ఆత్మపరిశోధన చేసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
హవ్వా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే చందంగా చంద్రబాబు వ్యవహారశైలి ఉంది. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఏ ఒక్క వర్గం కూడా వైసీపీ పాలనలో సంతృప్తిగా లేదన్నారు. మూడేళ్లలో ప్రజల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాన్ని తాను ఇంత వరకూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మరి 2019లో టీడీపీ కేవలం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకే పరిమితం కావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చంద్రబాబు చెప్పాలి. ఇది టీడీపీ ఘోర పరాజయానికి నిదర్శనం కాదా? ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తమ పార్టీని ఇంత ఘోరంగా ఓడిస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం కొరవడడం వల్లే ఘోర ఓటమి పొందాల్సి వచ్చిందని ఆయన నిష్టూరమాడారు.
టీడీపీ చరిత్రలో ఇంత ఘోరంగా ఓడిపోయిన దాఖలాలు లేవు. బాబు ప్రభుత్వంపై కంటే తీవ్ర వ్యతిరేకత ఎక్కడైనా ఉందా? జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కనీవినీ ఎరుగని రీతిలో ఓటమి మూటకట్టుకుంది. చివరికి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాల్టీతో పాటు పరిషత్, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ టీడీపీ, ఆ పార్టీ మద్దతుదారులు ఘోర పరాజయాన్ని పొందారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మాత్రమే జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎక్కడ కనిపిస్తుందో అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. శ్రేణుల్ని ఉత్సాహపరిచేందుకు తప్ప, మరెందుకూ చంద్రబాబు మాటలు పనికి రావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పగటి కలలు మాని , పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడితే మంచిది.