ఆంధ్రప్రదేశ్ అప్పులో కొంత ఇలా తీర్చేయొచ్చు

ఎక్కడో ఒక వెబ్సైట్లో వచ్చిన ఒక ఆర్టికల్ ని పట్టుకుని మెయిన్ స్ట్రీం మీడియాగా పిలవబడే ఒకానొక దినపత్రిక ప్రభుత్వం మీద బురదజల్లి ప్రజల్ని బెదరగొట్టే పని పెట్టుకుంది.  Advertisement దేశంలో అప్పులున్న రాష్ట్రాల…

ఎక్కడో ఒక వెబ్సైట్లో వచ్చిన ఒక ఆర్టికల్ ని పట్టుకుని మెయిన్ స్ట్రీం మీడియాగా పిలవబడే ఒకానొక దినపత్రిక ప్రభుత్వం మీద బురదజల్లి ప్రజల్ని బెదరగొట్టే పని పెట్టుకుంది. 

దేశంలో అప్పులున్న రాష్ట్రాల జాబితాలో సదరు వెబ్సైట్ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్ కు నాల్గవ స్థానమని ఏదో లెక్కచెబితే, ఇంకా తెలియని లెక్కలు చాలా ఉండొచ్చొని చెప్పి దేశంలోనే మొదటి స్థానం అని తేల్చేసింది ఈ తెలుగు మెయిన్ స్ట్రీం దినపత్రిక. 

ఇలా రాసేస్తే ప్రజలు నమ్మరేమోనని జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉత్సాహం చూపే రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ ల చేత మాట్లాడించి ఆ స్టేట్మెంట్లు వేసారు. 

ఇంతకన్నా దిగజారుడు తనం, దిక్కుమాలిన తనం ఉంటుందా? అధికారిక గణాంకాలు, సత్యాలు అవసరం లేదా? 

అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని రాతలు రాసి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీసుకొచ్చే ప్లాన్లేస్తున్నారు సరే. కానీ పత్రికల బాధ్యత అక్కడితో ఆగిపోదుగా! 

ఈ సమస్యకి పరిష్కారాల్లో భాగంగా అంధ్రప్రదేశ్ లో వ్యాపారాలు పెట్టి బ్యాంకుల్ని ముంచి శఠగోపం పెట్టి నేడు ఢిల్లీలో తలదాచుకుంటున్న ప్రబుద్ధుల్ని తమ బకాయిలు, పెనాల్టీలు చెల్లించమని పత్రికా ముఖంగా నిలదీయొచ్చుగా. సత్వరమే వారిని కంట్రోల్లోకి తీసుకుని డబ్బుని కక్కించమని ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చుగా.

ఆంధ్రాలోనే ఏకంగా లక్షకోట్ల రూపాయలకు పైగా ఆ ఎగ్గొట్టిన సొమ్ముంటుందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వారి మీద యాక్షన్ తీసుకుని ఆస్తుల్ని జప్తు చేసి వేలమేస్తే రాష్ట్రానికున్న ఎంతో కొంత అప్పుని తీర్చేయొచ్చు. కానీ అటువంటి పరిష్కారాలు సూచించరు సదరు పత్రికవారు. 

ఎందుకంటే ఎగ్గొట్టిన బాపతుగాళ్లంతా అస్మదీయులు మరి. పైగా ఎగ్గొట్టడంలో సదరు పత్రికా యజమాని కూడా సిద్ధహస్తులే. వారు చేసినా ఒకానొక చిట్ ఫండ్ వ్యాపారం తాలూకు కుంభకోణం గురించి అందరికీ తెలిసిందే. కోర్టుకు లాగి ఉక్కిరిబిక్కిరి చేస్తే తప్ప ఆయనగారు కూడా న్యాయంగా కట్టాల్సిన వేలకోట్లలో కొంతైనా కక్కలేదు అప్పట్లో. క్రమంగా కేసు కూడా మూసుకుపోయిందని ఈ ఉద్యమాన్ని ఎత్తుకున్న మాజీ ఎంపీ అయిన వకీలు ఈమధ్య వాపోయారు కూడా. 

తెదేపా ప్రభుత్వం ముసుగులో కొందరు నాయకులు చేసిన అర్థికనేరాల వెనుక లక్షల కోట్ల కుంభకోణాలున్నాయి. అయితే వారు విజయ్ మాల్యా మాదిరిగా దేశం విడిచి పారిపోలేదు. ఢిల్లీలోనే స్వేచ్ఛగా తిరుగుతూ సుజనులుగా చలమాణీ అయిపోతున్నారు. 

అలాంటి వారిని ఉపేక్షిస్తూ అప్పులు పాలౌతున్న రాష్ట్రాన్ని ఎద్దేవా చేయడానికి బదులు ఆపరేషన్ రికవరీ మొదలుపెడితే ఒక్క ఆ.ప్ర కే కాదు, దేశంలోని చాలా రాష్ట్రాలకి మంచిది. ఎందుకంటే ఆ స్థాయి మేతగాళ్లు అన్ని రాష్ట్రాల్లోనూ ఎంతో కొంతమంది ఉన్నారు. తెదేపా పాలనలో ఆ.ప్రలో తయారైన ఆర్థిక నేరస్థులు మాత్రం నభూతో నభవిష్యతి అని వేరే చెప్పక్కర్లేదు. 

ప్రతిసారీ పేదవారికి పంచే డబ్బునే బూచిగా చూపిస్తూ బెదరకొట్టడం ఎంతవరకూ సరైన జర్నలిజం? 

అసలీ మాట్లాడుతున్న వాళ్లంతా నిజంగా చిత్తశుద్ధితోనే మాట్లాడుతున్నారా? 

ఎందుకంటే…అప్పుల్లో యూపీ నెంబర్ వన్ అని, పంజాబ్ తర్వాతి స్థానమని పైన ప్రస్తావించిన వెబ్సైట్ పేర్కొంది. అలాంటప్పుడు యూపీలో ప్రజలు మళ్లీ యోగినే ఎందుకెన్నుకున్నారు?

పంజాబులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆం ఆద్మీ పార్టీ 300 యూనిట్లు లోపు కరెంటు ఖర్చు చేసే ప్రజలకి ఉచిత విద్యుత్ ఇస్తోంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రం అలా ఎందుకు చేస్తోందని అడగరేం? 

రాష్ట్రానికున్న అప్పు దేశం కనుసన్నల్లో ఉంటుంది. ఒక స్థాయికి మించి ఏ రాష్ట్రమూ అప్పు చేయలేదు. ఆ పరిస్థితే వస్తే అప్పుడే కేంద్రం బిరడా బిగిస్తుంది. అంతే తప్ప రాష్ట్రాలు శ్రీలంకలూ, బ్రెజిళ్లూ, సొమాలియాలు అయిపోవు. 

చంద్రబాబు హయాములో 2 లక్షల కోట్ల అప్పు చేయడం జరిగింది. ఆ డబ్బంతా ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్కుందా? ఈ పచ్చ పత్రికలు అప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఆ ప్రస్తావనే తీసుకురావేం? 

జగన్ ప్రభుత్వంలో చేస్తున్న అప్పు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోనే రొటేట్ అవుతోంది. ఎంత చెప్పినా ఈ మ్యాటర్ బుర్రకెక్కదా? 

సరే…రేపు 2024లో చంద్రబాబు మ్యానిఫెస్టోలో సంక్షేమ పథకాల ప్రస్తావన ఉంటుందా ఉండదా? జగన్ లాగ అప్పు తెచ్చి పథకాలు ఇవ్వను అని తెగేసే చెప్పే దమ్ము చంద్రబాబుకుంటుందా? అమరావతి కట్టి సంపాదిస్తానని చెబితే ప్రజలు నమ్మే స్థితిలో ఉంటారా? 

ప్రపంచంలో ఏ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న..అదిగో ఆంధ్ర కూడా అదే కాబోతోందంటూ పచ్చ మేథావులు, వారి సానుభూతి పరులూ కూడా కుహనా వ్యాఖ్యలు చేయడం ఒక తంతైపోయింది. 

రానున్న రెండేళ్లల్లో ఇక ఈ ఊకదంపుడే ఉంటుంది పచ్చ పత్రికల్లో. ఇలాంటివి ఎన్ని చేసినా స్థానిక ఎన్నికల్లో కాని,  బై ఎలక్షన్స్ లో కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రాభవాన్ని తగ్గించలేకపోయాయి ఆ పత్రికలు. ప్రస్తుతానికి ఈ అప్పులఊబి కథనాలే ఎక్కడ చూసినా. ఈ రాతల పనితనం ఏమిటో, పర్యవసానం ఎలా ఉంటుందో, మరొక గుణపాఠం ఎలా నేర్పుతుందో కాలమే చెప్పాలి. 

హరగోపాల్ సూరపనేని