తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడంలో తగ్గేదేలే అని గవర్నర్ తమిళిసై తన మాటలతో చెప్పకనే చెబుతున్నారు. కొంత కాలంగా కేసీఆర్ సర్కార్, గవర్నర్ మధ్య వివాదం నడుస్తోంది. గత నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే నడిపారు. ఇలా ఒక్కొక్కటిగా వివాదాలు పెరుగుతూ వచ్చాయి. ఉగాది పర్వదినానికి కేసీఆర్‌తో పాటు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆహ్వానించినా, రాజ్‌భవన్‌కు వారెవరూ వెళ్లలేదు. దీనిపై కూడా గవర్నర్ నొచ్చుకున్నారు.
ఇటీవల ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాలను కలిసిన గవర్నర్, ఢిల్లీ వేదికగా కేసీఆర్ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి కేసీఆర్‌పై గవర్నర్ విరుచుకుపడ్డారు. చెన్నైలో గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో కలిసి పని చేయడం కష్టమని వ్యాఖ్యానించారు. తాను ఇద్దరు వేర్వేరు ముఖ్యమంత్రులతో పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాల్లో విధులు చాలా భిన్నమైనవన్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి పని చేసిన అనుభవం తనకు ఓ విషయాన్ని నేర్పిందన్నారు. ఇక ఇతర ఏ ముఖ్యమంత్రులతో కూడా పని చేయగలననే నమ్మకం వచ్చినట్టు గవర్నర్ ప్రకటించడం విశేషం. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొందరు సీఎంలు నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మంచిది కాదని తమిళిసై హితవు పలికారు.
తనను మరో రాష్ట్రానికి మారుస్తారన్నది నిజం కాదని తేల్చి చెప్పారు. సీఎం చెప్పిందానికల్లా సంతకం చేయడానికి తాను రబ్బర్ స్టాంప్ కాదని తమిళిసై అన్నారు. గవర్నర్‌గా ఎవరున్నా.. ప్రోటోకాల్ పాటించాల్సిందేనని తెలిపారు. రాజ్‌భవన్ ఆహ్వానాలను రాజకీయంగా చూడకూడదని అన్నారు.
ఏ విభేదాలు ఉన్నా, చర్చలతో పరిష్కరించుకుందామని గవర్నర్ తమిళిసై తెలిపారు. తమిళనాడులో కూడా గవర్నర్ ఆహ్వానాన్ని అధికార పార్టీ మన్నించలేదని తమిళసై చెప్పడం గమనార్హం.