వివాదాస్పద అంశాన్ని టచ్ చేస్తున్న దర్శకుడు

ఈమధ్య తన సినిమాల కోసం యదార్థ ఘటనల్ని ఆధారంగా తీసుకుంటున్నాడు గోపీచంద్ మలినేని. క్రాక్ సినిమా కోసం ఒంగోలు పరిసర ప్రాంతాల్లో గతంలో జరిగిన కొన్ని ఘటనల్ని బేస్ చేసుకున్నాడు. ఇక వీరసింహారెడ్డి సినిమా…

ఈమధ్య తన సినిమాల కోసం యదార్థ ఘటనల్ని ఆధారంగా తీసుకుంటున్నాడు గోపీచంద్ మలినేని. క్రాక్ సినిమా కోసం ఒంగోలు పరిసర ప్రాంతాల్లో గతంలో జరిగిన కొన్ని ఘటనల్ని బేస్ చేసుకున్నాడు. ఇక వీరసింహారెడ్డి సినిమా కోసం కూడా వేటపాలెంలోని వందేళ్ల చరిత్ర కలిగిన లైబ్రరీని సందర్శించి చిన్నపాటి పరిశోధన చేశాడు.

ఇప్పుడీ దర్శకుడు రవితేజతో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగానే తెరకెక్కనుంది. అయితే ఈసారి ఈ దర్శకుడు కాస్త వివాదాస్పద అంశాన్ని టచ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

చుండూరు.. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. దళితుల్ని ఊచకోత కోసిన ప్రదేశంగా చరిత్రలో నిలిచిపోయింది చుండూరు. దాదాపు 32 ఏళ్ల కిందట, దాదాపు 300 మంది అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు, దళితులపై విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా దాడిచేసి, అత్యంత క్రూరంగా 8 మందిని హత్య చేశారు.

ఆ టైమ్ లో దేశం మొత్తాన్ని కుదిపేసిన చుండూరు పేరు, ఇప్పుడు గోపీచంద్ మలినేని, రవితేజ కొత్త సినిమా పోస్టర్ పై ప్రత్యక్షమైంది. దీనికి మరింత బలం చేకూరుస్తూ, గ్రామం మొత్తం తగలబడిపోతున్న దృశ్యాల్ని పోస్టర్ లో చూపించారు.

చుండూరు ఊచకోత అంశాన్ని గోపీచంద్ మలినేని ఎత్తుకుంటే మాత్రం అతడు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే, ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. సోషల్ మీడియా బాగా విస్తరించిన ఈ రోజుల్లో, అప్పటి అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తే రాష్ట్రవ్యాప్తంగా దళితులు ఆగ్రహానికి గురయ్యే అవకాశం కూడా ఉంది.