అచ్చెన్న… హోం మంత్రి…?

తెలుగుదేశం పార్టీ మూడేళ్ళుగా అధికార విరహంతో తెగ బాధపడుతోంది. మరో రెండేళ్ల వరకూ ఎన్నికలు అయితే లేవు, అసలు జరగవు. ఆ మీదట వైసీపీ ఓడి టీడీపీ గెలవాలి. ఇదంతా ఇపుడే జరిగిపోతున్నట్లుగా టీడీపీ…

తెలుగుదేశం పార్టీ మూడేళ్ళుగా అధికార విరహంతో తెగ బాధపడుతోంది. మరో రెండేళ్ల వరకూ ఎన్నికలు అయితే లేవు, అసలు జరగవు. ఆ మీదట వైసీపీ ఓడి టీడీపీ గెలవాలి. ఇదంతా ఇపుడే జరిగిపోతున్నట్లుగా టీడీపీ నేతల మాటలు అయితే ఉన్నాయి. ఇంకా విడ్డూరం ఏంటి అంటే ఎన్నికలు లాంచనం అని వచ్చేది టీడీపీ సర్కారేనని ఆ పార్టీ నేతలు గట్టిగా ఫిక్స్ అయినట్లున్నారు.

దాంతో పెదబాబు చినబాబు నుంచి అచ్చెన్నాయుడు వరకూ అంతా ఒక్కటే అంటున్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఇంతకు ఇంతా బదులిస్తామని, చినబాబు లోకేష్ అయితే తాను చంద్రబాబు అంత సాఫ్ట్ కానని ఇప్పటికే పలుమార్లు చెప్పేసుకున్నారు. ఆయన సంగతి అలా ఉంటే అచ్చెన్నాయుడు అయితే మేము అధికారంలోకి వస్తే మమ్మల్ని వేధించిన ప్రతీ ఒక్కరి మీద యాక్షన్ ఉంటుందని క్లారిటీగా చెప్పేశారు.

దాని కోసం ప్రత్యేక కమిషన్ ని కూడా వేస్తారట. వైసీపీలో వేధింపులకు గురి అయిన వారి వివరాలకు పోలీస్ స్టేషన్ల వారీగా వివరాలు తీసి మరీ యాక్షన్ తీసుకుంటామని కాబోయే హోం మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు చెప్పేస్తున్నారు. ఇక రెండేళ్ల క్రితమే అచ్చెన్నాయుడు తానే హోం మంత్రిని అంటూ తానుగా చెప్పుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది.

మొత్తానికి ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్లుగా ఈ జోరు ఉందని అంటున్నారు. నిఖ్సార్సు అయిన నిజమేమిటీ అన్నది చూస్తే ఏపీలో ఉన్నది వైసీపీ జమానా. ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయి. అపుడు కూడా టీడీపీ  గెలవాలి. కానీ వైసీపీ నేతల మీద యాక్షన్ తీసుకుంటామంటూ ప్రతీ రోజూ ఇలా పెద్ద నోరు చేసుకోవడం వల్ల లాభమేదైనా ఉందా అంటే చాలానే ఉంది. 

అదే ఆత్మానందం. అందుకే వరసబెట్టి టీడీపీ నేతలు వచ్చేది మేమే అంటూ తమకు తామే బూస్ట్ ఇచ్చుకుంటున్నారులా ఉందని వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి.