ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలదాటింది. ఎక్కువ మంది చూపు కూటమి మ్యానిఫెస్టో అమలుపై ఉంది. ఈ నేపథ్యంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పుడనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనిపై రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇవ్వడం విశేషం.
అనగాని సత్యప్రసాద్ చెబుతున్న ప్రకారం ఆగస్టు 15 …అంటే స్వాతంత్య్ర దినం సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, త్వరలో మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ఇటీవల రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల రవాణాశాఖ అధికారులకు ఏపీ అధికారులు లేఖలు రాసినట్టు తెలిసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రోజువారీ ప్రభుత్వంపై పడే భారం గురించి అడిగినట్టు సమాచారం. ఈ లోపు ఆ రెండు రాష్ట్రాల నుంచి వివరాలు రావడం, అనంతరం వెంటనే పథకం అమల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుండగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై రవాణాశాఖ మంత్రికి బదులు రెవెన్యూశాఖ మంత్రి వివరాలు వెల్లడించడం విశేషం.
ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచితంగా ఇసుక పంపిణీ పథకాలకు శ్రీకారం చుట్టినట్టు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. వరుసగా అన్ని పథకాలను అమలు చేస్తామని కూటమి నేతలు అంటున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 15న మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి కూడా శ్రీకారం చుట్టి, ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వంగా నిరూపించుకుంటామని కూటమి నేతలు చెబుతున్నారు.