ఒక ఆదివాసి మహిళతో తనకు సంబంధం అంటగట్టడంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు తీవ్రస్థాయిలో స్పందించారు. మీడియా సమావేశంలో జర్నలిస్టులపై ఆయన వాడిన పదజాలంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఎలాంటి సంబంధం లేని వివాహేతర అంశాల్లోకి లాగడంపై విజయసాయిరెడ్డి తీవ్ర ఎమోషన్‌కు గురయ్యారు.
అయితే జర్నలిస్టుల అభిమానాన్ని నిలుపుకునేందుకు ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ఇందులో విజయసాయిరెడ్డికి నీతులు చెప్పడం గమనార్హం. అయితే తల్లిని అవమానించారని అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసిన లోకేశ్, ఒక బాధితుడిగా మహిళా అధికారిపై మీడియా దాడిని పరోక్షంగా సమర్థించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయసాయిరెడ్డి రాజకీయ ప్రత్యర్థి. ఆయనపై ఎలాంటి విమర్శలు చేసినా ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన అవసరం లేదు.
కానీ ఆదివాసి మహిళను అవమానించేలా మీడియా వికృత కథనాల్ని ప్రసారం చేయడం, డిబేట్లు పెట్టడంపై నాగరిక సమాజం అసహ్యించుకుంటోంది. ఇవేవీ లోకేశ్‌కు అవసరం లేనట్టుంది. సమాజం నుంచి అసహ్యానికి గురయ్యేలా డిబేట్లు నిర్వహించింది తమ అనుకూల మీడియానే కావడంతో ఆయన వెనకేసుకొచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ సోషల్ మీడియా పోస్టు ఏంటంటే.
“విజయసాయిరెడ్డి గారు! మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచీమర్యాదల గురించి చెప్పాల్సిన పనిలేదు. మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు ఛీ కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదు”
గెలిచిన వాళ్లు ఏమైనా మాట్లాడేందుకు సర్టిఫికెట్ ఇచ్చినట్టు అని లోకేశ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే ఆయన విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు. ఒక ఆదివాసి మహిళతో వివాహేతర సంబంధాలు అంటకడితే మానసిక స్థితి ఎలా వుంటుందో, ఒకసారి ఆయన స్థానంలో మీరు వుంటే తెలుస్తుందని విజయసాయిరెడ్డి అనుచరులు అంటున్నారు.
మీడియా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి, ఇష్టానురీతిలో వ్యవహరించడాన్ని లోకేశ్ సమర్థించడం ఎంత వరకు సరైందో ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం వుంది. తప్పు చేసింది తమ అనుకూల మీడియా కాబట్టి, సమర్థిస్తానని లోకేశ్ అనుకుంటే చేయగలిగిందేమీ లేదు.