బాబు తెలివితేట‌లు చూస్తున్నావా జ‌గ‌న్‌?

స‌మాజం త‌ల‌కిందులుగా వుంద‌ని ఒక ర‌చ‌యిత అన్నారు. అందుకే మోస‌గించే వాళ్లు తెలివిప‌రులుగా చెలామ‌ణి అవుతున్నారు. ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కుల మోసాలు వెంట‌నే బ‌య‌ట‌ప‌డుతుంటాయి. అది కూడా అధికార పార్టీ తానిచ్చిన హామీకి క‌ట్టుబ‌డ‌క‌పోతే…

స‌మాజం త‌ల‌కిందులుగా వుంద‌ని ఒక ర‌చ‌యిత అన్నారు. అందుకే మోస‌గించే వాళ్లు తెలివిప‌రులుగా చెలామ‌ణి అవుతున్నారు. ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కుల మోసాలు వెంట‌నే బ‌య‌ట‌ప‌డుతుంటాయి. అది కూడా అధికార పార్టీ తానిచ్చిన హామీకి క‌ట్టుబ‌డ‌క‌పోతే ప‌చ్చి మోసం చేస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం అధికార పార్టీలు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయో అంద‌రూ చూస్తున్నారు.

ఆశ్చ‌ర్యం ఏమంటే… ఏపీలో చంద్ర‌బాబు నెల పాల‌న‌కే ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. తెలంగాణ‌లో నిరుద్యోగులు రోడ్డెక్క‌డానికి ఆరు నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. పాల‌కుల తెలివితేట‌లపై ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఆధారప‌డి వుంటుంది.

తాజాగా ఏపీలో గ్యారెంటీడ్ పెన్ష‌న్ స్కీమ్ (జీపీఎస్‌)పై ప్ర‌భుత్వం మూడు రోజుల క్రితం గెజిట్ విడుద‌ల చేయ‌డం ఉద్యోగ‌, ఉపాధ్యాయ వ‌ర్గాల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. అప్ప‌ట్లో ఉద్యోగ, ఉపాధ్యాయ వ‌ర్గాలు వ్య‌తిరేకించాయి. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ స‌ర్కార్ ప‌ట్టించుకోలేదు. ఎన్నిక‌ల్లో ఎలాంటి ఫ‌లితం వ‌చ్చిందో విధిత‌మే.

జీపీఎస్ కంటే మెరుగైన స్కీమ్ తీసుకొస్తామ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ హామీ ఇచ్చారు. క‌నీసం ఉద్యోగుల‌తో చ‌ర్చించ‌కుండానే జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చిన స్కీమ్‌కే గెజిట్ విడుద‌ల చేయ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌చ్చి మోసానికి పాల్ప‌డింద‌నే తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ ప‌థ‌కంపై ఉద్యోగుల నుంచి రియాక్ష‌న్స్ ఎలా వుంటాయో ప‌రీక్షించిన చంద్ర‌బాబు స‌ర్కార్‌, తీవ్ర వ్య‌తిరేకత వ‌స్తోంద‌ని గ్ర‌హించింది.

దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. అస‌లు ఆ గెజిట్ త‌న‌కు తెలియ‌కుండానే వ‌చ్చింద‌ని, బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు విచారించాల‌ని ఆదేశించిన‌ట్టు టీడీపీ అనుకూల మీడియాలో త‌మ మార్క్ ప్ర‌చారానికి తెర‌లేపడం గ‌మ‌నార్హం. మంచి జ‌రిగితే త‌న వ‌ల్ల‌, లేదంటే జ‌గ‌న్ స‌ర్కారే కార‌ణ‌మ‌ని ప్ర‌చారం చేయించుకోవ‌డంలో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆయ‌న తెలివితేట‌లుగా చెప్పుకుంటున్నారు. 

బాబు స‌ర్కార్ కొలువుదీరిన నెల‌కే ఉద్య‌మాలంటే చెడ్డ‌పేరు వ‌స్తుంద‌నే ఉద్దేశంతోనే అయిష్టంగా అయినా జీపీఎస్‌పై తాత్కాలికంగా చంద్ర‌బాబు స‌ర్కార్ వెన‌క్కి త‌గ్గిన‌ట్టు చెబుతున్నారు. ఏదైనా ఒక అంశం తెరపైకి తేవ‌డం, దానిపై సంబంధిత వ‌ర్గాల రియాక్ష‌న్స్ అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం పాల‌కుల ఎత్తుగ‌డ‌గా చెబుతారు. జీపీఎస్‌పై కూడా అలాంటి వ్యూహాన్నే చంద్ర‌బాబు స‌ర్కార్ అనుస‌రించింది.

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌మ ప్రత్య‌ర్థి చంద్ర‌బాబునాయుడి నుంచి ఎంతో నేర్చుకోవాల్సి వుంద‌న‌డానికి జీపీఎస్‌పై నిర్ణ‌య‌మే ఉదాహ‌ర‌ణ‌. జ‌గ‌న్ స‌ర్కార్ ఎప్పుడూ ఇలా వ్య‌వ‌హ‌రించిన దాఖ‌లాలు లేవు. ప్ర‌జాభిప్రాయంతో సంబంధం లేకుండా తాను అనుకున్న‌దే చేయ‌డం వ‌ల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింద‌ని వైసీపీ నాయ‌కులు ఇప్ప‌టికైనా గ్ర‌హిస్తే మంచిది.