చంద్రబాబు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నూతన ఇసుక పాలసీకి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపింది. జగన్ సర్కార్ దిగిపోయి కొత్త ప్రభుత్వం కొలువుదీరినా, అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి.
పౌరసరఫరాలశాఖ తరపున రూ.2 వేలు కోట్లు, అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్లు రుణం తీసుకునేందుకు వ్యవసాయ, సహకార కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలపై చర్చించాలనే విషయమై కేబినెట్ సమావేశంలో మాట్లాడుకున్నారు. ఇప్పటికే నాలుగు శ్వేత పత్రాలను చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వెళ్లే అవకాశం లేదు. కేవలం 11 సీట్లే వైసీపీకి ఉండడం, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో అసెంబ్లీకి వెళ్లినా ప్రయోజనం వుండదని వైఎస్ జగన్ అన్న సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా జరగనున్నాయి.