తెలంగాణలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున హామీలిచ్చింది. రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి. కాంగ్రెస్ హామీలకు తెలంగాణ ప్రజలు ఆకర్షితులయ్యారు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడం మొదలు పెట్టాయి. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ రూపాల్లో ప్రతిపక్ష పార్టీలున్నాయి.
ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. విధివిధానాల్ని కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకునేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఇద్దరు మంత్రుల్ని కూడా నియమించింది. అంతా బాగుందని అనుకుంటున్న సమయంలో తాజాగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రైతు రుణమాఫీపై సంచలన ఆరోపణలు చేశారు.
రేషన్‌కార్డు ఉన్న వారికే రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి తన విధానాన్ని ప్రకటించినట్టు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండడం గమనార్హం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ రేషన్‌కార్డు ఉన్న రైతులకే రుణమాఫీ అని చెప్పడం అన్యాయమన్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటి షరతులు లేవన్నారు. ప్రతి రైతు రూ.2 లక్షలు చొప్పున రుణాన్ని తెచ్చుకోవాలని కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారని ఆయన గుర్తు చేశారు.
అధికారం దక్కించుకున్న తర్వాత రైతుల్ని మోసగించడం దుర్మార్గమన్నారు. షరతుల్లేకుండా ఇచ్చిన హామీకి కట్టుబడి రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేయాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మరోసారి మోసానికి పాల్పడుతోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్ని మరిచిపోయి, ఇప్పుడు షరతులు పెడుతోందని ఆమె ధ్వజమెత్తారు. సంపూర్ణ రుణమాఫీ చేసే వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రశ్నే లేదని ఆమె హెచ్చరించారు.