కేసీఆర్ సర్కార్ హయాంలో విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపై నిగ్గు తేల్చేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషన్ చైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడ్డం ఏంటని చీఫ్ జస్టిస్ నిలదీశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్‌ను తప్పు పట్టడం చర్చనీయాంశమైంది.
తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇందులో మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తదితరులను జైలుకు పంపాలని చూస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకల నిగ్గు తేల్చేందుకు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే విద్యుత్ సంబంధిత అధికారులను కమిషన్ చైర్మన్ విచారించారు. విచారణకు రావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. అసలు తనను విచారించే అర్హతే చైర్మన్‌కు లేదని, పైగా ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించిన తర్వాత పారదర్శకత ఎక్కడని నిలదీస్తూ కేసీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. మరోవైపు విచారణకు రానంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగారు.
విచారణకు హాజరు కావాల్సిందే అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. రిటైర్డ్ జస్టిస్ నర్సింహారెడ్డిని విచారణ నుంచి తప్పించాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించారు.
విచారణ వివరాలను ప్రెస్‌మీట్ పెట్టి విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా వెల్లడిస్తారని ప్రశ్నించారు. న్యాయమూర్తి విచారణ చేయడమే కాకుండా, నిష్పక్షపాతంగా ఉన్నట్టు కనిపించాలని చీఫ్ జస్టిస్ కామెంట్స్ చేశారు. విచారణ కమిషన్ చైర్మన్‌ను మార్చాలన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలను పాటిస్తామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ కొత్త చైర్మన్ ఎవరనేది రేవంత్‌రెడ్డి సర్కార్ కోర్టుకు చెప్పనుంది.