జనసేనలో బొలిశెట్టి సత్యనారాయణ ముఖ్య నాయకుడు. పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాపై ఆయనకు కొన్నిసార్లు కోపం వస్తుంటుంది. బీజేపీ, టీడీపీ పాలనారీతులు ఆయనకు ఏ మాత్రం నచ్చవు. అయినప్పటికీ జనసేన నాయకుడిగా నిగ్రహం పాటిస్తుంటారు. టీడీపీ, బీజేపీ నేతల చేష్టలు శ్రుతి మించినప్పుడు, బొలిశెట్టి కుండబద్ధలు కొట్టినట్టు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. బొలిశెట్టి కామెంట్స్ వివాదాస్పదమైనప్పుడు, అబ్బే తన అభిప్రాయాల్ని వక్రీకరించారని ఆయన తరచూ అనడం చూస్తుంటాం.
తాజాగా మరోసారి కూటమిని ఆయన ఇరకాటంలో పడేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎర్రమట్టి దిబ్బల్ని కొల్లగొట్టడంపై ఆయనే ఎక్స్ వేదికగా లోకం దృష్టికి తీసుకొచ్చారు. విశాఖలోని భౌగోళిక వారసత్వ సంపదను దోపిడీ చేస్తున్నారని, అరికట్టాలని పర్యాటకశాఖ మంత్రి అయిన తమ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ దృష్టికి సోషల్ మీడియా వేదికగా ఆయన తీసుకెళ్లడం గమనార్హం.
ఇదే అంశాన్ని తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రస్తావించడం గమనార్హం. అమర్నాథ్ పోస్టు ఏంటంటే…
“ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు, చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి 35 రోజుల్లో విశాఖలోని భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టిదిబ్బల పరిస్థితి ఇది. ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నాయకుల మద్దతుతోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇలా చెప్పకనే చెప్తున్నారు”
కూటమి ప్రభుత్వం కొలువుదీరకనే రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కూటమిలోని జనసేన పార్టీ నాయకులే సోషల్ మీడియా వేదికగా వారసత్వ సంపదను దోచేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారంటేపరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇదిలా వుండగా బొలిశెట్టి సత్యనారాయణ వైఖరిపై టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారని సమాచారం. ఆయన తీరుతో కూటమికి రాజకీయంగా నష్టం వస్తోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.