తెలుగు రాష్ట్రంలో తెలుగులో జీవో.. వావ్.. ఎంత గొప్ప సంగతి!

తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వం తెలుగులో జీవో (గవర్నమెంట్ ఆర్డర్) విడుదల చేసింది. ఆ తెలుగు రాష్ట్రం పేరు తెలంగాణ. తెలుగు రాష్ట్రమని, ఇక్కడ తెలుగు భాష ఉంటుందని మనం అనుకుంటున్నాం. కాని తెలంగాణ వాదులు…

తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వం తెలుగులో జీవో (గవర్నమెంట్ ఆర్డర్) విడుదల చేసింది. ఆ తెలుగు రాష్ట్రం పేరు తెలంగాణ. తెలుగు రాష్ట్రమని, ఇక్కడ తెలుగు భాష ఉంటుందని మనం అనుకుంటున్నాం. కాని తెలంగాణ వాదులు మాది తెలంగాణ భాష అంటారు. సరే.. ఇప్పడు ఈ చర్చ అనవసరం. తెలంగాణ ఏర్పడిన తరువాత, అంటే పదేళ్ల తరువాత మొదటిసారిగా తెలుగులో, అది కూడా అందరికీ అర్థమయ్యే భాషలో (వ్యవహారిక భాషలో) జీవో వచ్చింది. ఇది కూడా విశేషమే.

ఎందుకంటే.. పత్రికల్లో తెలుగులో వచ్చే  ప్రభుత్వ టెండర్నోటీసులు, ప్రకటనలు మొదలైనవి కఠినాతి కఠినంగా, కొరుకుడు పడని విధంగా ఉంటాయి. పాషాణ పాక ప్రభువులు ఎవరు రాస్తారో తెలియదు. కాని ఇప్పడు చక్కటి తెలుగులో జీవో వచ్చిందంటూ  ఓ పత్రిక మురిసిపోయింది. తెలుగు రాష్ట్రంలో తెలుగులో జీవో రావడం నిఝంగా ఓ పెద్ద విశేషమే మరి. మన రాష్ట్రం తమిళనాడో, కర్నాటకో కాదు కదా. అక్కడైతే వారి మాతృ భాషలో జీవోలు రావడం సహజం. కాబట్టి పెద్దగా ఆశ్చర్యం కలగదు.

కాని తెలుగులో జీవోలు ఇవ్వడం, తెలుగులో కోర్టు తీర్పలు రావడం మనకు బోలెడు ఆశ్చర్యంగా ఉంటుంది. మీడియాలో అదో బ్రేకింగ్ న్యూస్(తెలుగులో ఏమంటారో?) కింద లెక్క. పంట రుణాల మాఫీకి సంబంధించిన మార్గదర్శకాల పైన ఆ జీవో జారీ అయింది. పంట రుణాలంటే రైతులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి, వారికి అర్థం కావాలి కాబట్టి తెలుగులో ఉత్తర్వు జారీ చేసి ఉండొచ్చు. రైతుల్లో కూడా అంతో ఇంతో ఇంగ్లిషు తెలిపినవారు ఉండొచ్చు. కాని రుణాల మాఫీ అనేది చిన్న రైతులకు సంబంధించిన వ్యవహారమే కాబట్టి వారికి అర్థం కాకపోతే కష్టం కదా.

అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తమది ‘ప్రజా పాలన’ అని చెప్పకుంటోంది కాబట్టి జీవోలు తెలుగులోనే అంటే ప్రజల భాషలోనే ఉండాలి. తెలుగులో జీవో విడుదల చేయడం ఈ ఒక్క దాంతోనే సరిపెడతారో, ఇక నుంచి తెలుగులోనే ఇస్తారేమో చెప్పలేం. ప్రభుత్వంలో ఉన్నతాధికారుల్లో  కొందిరికి తెలుగు అసలు రాదు. వచ్చినా అరకొరగానే ఉంటుంది. వీళ్లు సాధారణంగా ఇతర రాష్ట్రాల అధికారులై ఉంటారు. అచ్చ తెలుగు అధికారులకు తెలుగులో ఎలా రాయాలో అర్థం కాకపోవొచ్చు.

రాసేది కింది స్థాయి ఉద్యోగులే అయినా వారికీ తెలుగు పరిజ్ఞానం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆ జీవోలను ఆమోదించాల్సింది ఉన్నతాధికారులే (సాధారణంగా ఐఏఎస్ లే ఉంటారు)కాబట్టి వారు తెలుగును అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అందులోనూ మనకు వలస పాలకుల వాసనలు ఇంకా మిగిలి ఉన్నాయి కదా. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పాలనా వ్యవహారాలు ప్రజల భాషలో జరపాలనే శ్రద్ధ మన పాలకులకు మొదటి నుంచీ లేదు. తెలుగులోనే జీవోలు, చట్టాలు, నిబంధనలు ఉండాలని పాపం.. కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశాడట. కాని నీరుగారిపోయాయి. అంటే.. కేసీఆర్ కూడా సరిగా పట్టించుకోలేదని అర్థమవుతోంది.